విహారయాత్రల వేళ అప్రమత్తత ముఖ్యం
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సెలవులకు తాత్కాలికంగా ఇళ్లకు తాళాలు వేసి విహార యాత్రలు, తీర్థయాత్రలు వెళ్లే ప్రజలు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషనన్‌లో ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. సంక్రాంతి సెలవులను ఆసరాగా చేసుకొని తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. సమాచారం అందిస్తే ఇంటిపై నిరంతర పోలీసు నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ నిఘాను పటిష్టం చేస్తామన్నారు. విహార యాత్రలకు వెళ్లే సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో, ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని మొబైల్ ఫోనన్‌లకు అనుసంధానం చేసి ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలు సముద్రాలు, నదులు, కాలువలు వంటి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే, తప్పనిసరిగా సురక్షితమైన ప్రదేశాల్లోనే తల్లిదండ్రులు, పెద్దల సంరక్షణలో వెళ్లే విధంగా చూసుకోవాలన్నారు. జలవనరుల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.


