వేపగింజల కషాయంతో కత్తెర పురుగు నివారణ
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి
ప్రత్తిపాడు: వేప గింజల కషాయంతో కత్తెర పురుగు ఉధృతిని తగ్గించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి అన్నారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో బుధవారం ఆత్మ సౌజన్యంతో శాస్త్రవేత్తలు రైతులతో చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మ పీడీ వెంకటేశ్వరరావు రైతులు సాగు చేస్తున్న పంటలు, పంట మార్పిడి విధానం, సాగు నీరు, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం.. వంటి అనేక అంశాలపై రైతులకు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి మాట్లాడుతూ కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ ఐదు శాతం వేసి ఎకరాకు 60 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటో ఫాస్ 36 ఎస్.ఎల్ ఎకరాకు 320 మిల్లీలీటరు లేదా క్లోరంట్రినిలిప్రోల్ (క్రోరాజెన్) పిచికారీ చేసుకోవాలన్నారు. గుంటూరు ఏడీఏ ఎన్.మోహన్‌రావు మండల వ్యవసాయాధికారి షేక్.సుగుణ బేగం మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రైతులందరూ పంట నమోదు తప్పకుండా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌ఎన్ వి.షణ్ముఖ రెడ్డి, ఎంపీఈవో కె.నాగరాజు, ఏఈవో వై. నీలాంబరం పాల్గొన్నారు.
వేపగింజల కషాయంతో కత్తెర పురుగు నివారణ


