గుంటూరు చేరుకున్న ‘జన చైతన్య యాత్ర ’
కొరిటెపాడు(గుంటూరు): ఏపీ – తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (ఏపీఅండ్‌టీబీఈఎఫ్) ఆధ్వర్యంలో ప్రజా రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ‘జన చైతన్య యాత్ర – సైకిల్ రైడ్’ విజయవంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు సుమారు 850 కిలోమీటర్లు, జిల్లా నుంచి జిల్లా, ప్రజల మధ్యకు వెళ్లేలా రామరాజు నిర్వహిస్తున్న సైకిల్ రైడ్ యాత్ర గుంటూరు చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు ఏటుకూరు రోడ్డు వద్ద ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు యాత్ర చేరుకుంది. అక్కడ నుంచి గుంటూరులో అన్ని బ్యాంకుల ఉద్యోగులు ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జీటీ రోడ్‌లోని యూనియన్ బ్యాంకు రీజినల్ ఆఫీసు వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ నాయకులు రామకృష్ణ, వేణుబాబు, రవిచంద్రారెడ్డి, పృథ్వీ, మురళీ షరీఫ్, పావని క్రాంతి, అఖిల, పి.కిషోర్ కుమార్ తదితర నాయకులు మాట్లాడుతూ ప్రజారంగ బ్యాంకులను బలహీనపరచే విధానాలకు వ్యతిరేకంగా, బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రకు ప్రజలు, ఉద్యోగుల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు. దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్వాంకులలో దాచుకొన్న సొమ్ము సుమారు రూ.230 లక్షల కోట్లు సురక్షితంగా ఉండాలంటే బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ప్రజలను చైతన్యపరుస్తూ బ్యాంకులను కాపాడు కోవాలని తెలిపారు. ఈ సైకిల్ యాత్రను కొనసాగిస్తూ రామరాజు చిలకలూరిపేట మీదుగా ఒంగోలు వెళ్లారు.


