ప్రత్యేక ప్రణాళికతో పర్యాటకాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ప్రణాళికతో పర్యాటకాభివృద్ధి

Jan 7 2026 7:32 AM | Updated on Jan 7 2026 7:32 AM

ప్రత్యేక ప్రణాళికతో పర్యాటకాభివృద్ధి

ప్రత్యేక ప్రణాళికతో పర్యాటకాభివృద్ధి

ప్రత్యేక ప్రణాళికతో పర్యాటకాభివృద్ధి

ప్రతి మహిళకు బ్యాంక్‌ రుణం ఇవ్వాలి

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యేక ప్రణాళిక ద్వారా జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాదో నగరంతోపాటు తెలంగాణ ప్రాంతానికి చీరాల, బాపట్ల, నిజాంపట్నం గోల్డెన్‌ శాండ్‌ బీచ్‌లు దగ్గరగా ఉన్నాయన్నారు. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా బీచ్‌లను వరల్డ్‌ క్లీన్‌ బీచ్‌లుగా మారుస్తామన్నారు. సూర్యలంక తీరంలో దాదాపు రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలు పెట్టామని పేర్కొన్నారు. రూ.25 కోట్లతో 216 జాతీయ రహదారి నుంచి బీచ్‌లు ఉన్న రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, పాండురంగాపురం, అక్కడినుంచి ఈపూరుపాలెం స్ట్రెయిట్‌కట్‌ ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నిజాంపట్నంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పేరలి డ్రైన్‌ నుంచి సూర్యలంక వరకూ హౌస్‌ బోట్లు నడుపుతామన్నారు. జిల్లాలో టూరిజం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని రేపల్లె, బాపట్ల, వేమూరు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక టాస్క్‌ఫోర్సుతో చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్‌ మాఫియాపైనా చర్యలు తీసుకుంటామన్నారు. వీటన్నింటినీ జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

గ్రామాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

బాపట్ల పంచాయతీ, మున్సిపల్‌ విభాగాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగింది. జిల్లాలో అమలవుతున్న పనులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. యాభై శాతం కంటే తక్కువ పనితీరు ఉన్న మండలాలపై అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ సిబ్బందికి అవార్డులు అందజేస్తామని తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలి

రెవెన్యూ, హెల్త్‌, అగ్రికల్చర్‌, శానిటేషన్‌ నిర్వహణలో ప్రజా సానుకూలతలో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా టాప్‌ 3లో ఉండేలా సంబంధిత శాఖ అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఎంహెచ్‌ఓ, మెడికల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

రిజిస్ట్రేషన్‌లు పారదర్శకంగా జరగాలి

పిట్టలవానిపాలెం(కర్లపాలెం): భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ చెప్పారు. పిట్టలవానిపాలెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించారు. సీనియర్‌ సహాయకులు పఠాన్‌ హుస్సేన్‌ఖాన్‌, పీవీ పాలెం తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు ఉన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలపై

సుమోటోగా విచారిస్తున్నాం

బాపట్ల: కుల ధ్రువీకరణ పత్రాలను సుమోటోగా తీసుకుని విచారిస్తున్నామని స్పెషల్‌ సీఎస్‌ దృష్టికి జిల్లా కలెక్టర్‌ తీసుకువెళ్లారు. రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూఆర్‌డీ స్పెషల్‌ సీఎస్‌డీ సాయి ప్రసాద్‌, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ జయలక్ష్మి కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. కుల ధ్రువీకరణ పత్రాల కొరకు ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా విచారించిన తదుపరి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. బాపట్ల జిల్లాలో 3,94,172 మంది ధ్రువీకరణ పత్రాలను సుమోటోగా విచారించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశామన్నారు.

‘సాక్షి’తో జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌

బాపట్ల: డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాలునందు డీఆర్‌డీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులతో బ్యాంకు లింకేజీ, ఉన్నతి, శ్రీనిధి, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ల ద్వారా అందించే రుణాలపై, పలు వర్గాలకు ఉపకార వేతనాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి డ్వాక్రా మహిళకు బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement