ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
పర్చూరు బొమ్మల సెంటర్ వద్ద ధర్నా నిర్వహించిన రైతులు తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి వినతిపత్రం అందజేత రైతుల సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్న రైతులు
పర్చూరు(చినగంజాం): గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించి పర్చూరు ప్రాంత ప్రజలు, రైతులకు సాగునీరు, తాగునీరు అందించి ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహనరావు, రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో పర్చూరు బొమ్మల సెంటర్ వద్ద మంగళవారం పర్చూరు ప్రాంత రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగించాలని, చానల్ పొడిగింపునకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ పర్చూరు తహసీల్దార్ కార్యాలయ వరకు ర్యాలీగా శాంతియుతంగా ధర్నాను కొనసాగించారు. అనంతరం గుంటూరు చానల్ పొడిగింపునకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సుధారాణికి చదివి వినిపించిన అనంతరం ఆమెకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజమోహనరావు మాట్లాడుతూ కృష్ణానది చాలా దగ్గరలో ఉన్నప్పటికీ బ్రిటిషు ప్రభుత్వం పాలన నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా గుంటూరు చానల్ ద్వారా పర్చూరు ప్రాంతానికి పట్టుబట్టి నీరిచ్చేందుకు చర్యలు తీసుకోలేదు. పర్చూరు ప్రాంతానికి కృష్ణా నది చాలా దగ్గరలో ఉందని ప్రభుత్వం ప్రభుత్వం సాగు నీటి కోసం రూ. 109 కోట్లు మంజూరు చేసిందని వాటిలో గుంటూరు చానల్‌ను పెదనందిపాడు వరకు కొనసాగించేందుకు రూ. 75 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, పర్చూరు ప్రాంతవరకు చానల్‌ను పొడిగించి నీరిచ్చేందుకు మరో రూ. 7 కోట్లు మంజూరు చేసి కేవలం 49 ఎకరాలు భూసేకరణ జరిపితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే గజిట్ నోటిఫికేషన్ ఇచ్చి పర్చూరు ప్రాంతానికి నీరిచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.
కార్యక్రమంలో కోట హరిప్రసాద్, ఎం. జగన్నాథం, తోకల కృష్ణమోహన్, వై. హరిప్రసాద్, గడ్డిపాటి శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు, లంకాశివ, ఒగ్గిశెట్టి నరసింహం, గోవిందరాజులు , మల్లా శ్రీనివాసరావు , కె. ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి


