ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు
చినగంజాం నుంచి చెక్ పోస్టులు ఏర్పాటు ఆర్డీవో చంద్రశేఖర నాయుడు
చీరాల టౌన్ : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని.. చీరాల రూరల్ మండలం నుంచి చినగంజాం మండలం వరకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాలకు చెందిన రెవెన్యూ, పంచాయితీ రాజ్, పోలీస్ అధికారులతో ఆర్డీవో జాయింట్ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేయనీయకుండా చీరాల మండలంలోని రూరల్ గ్రామాల నుంచి చినగంజాం మండలంలోని గ్రామాల వరకు చెక్‌పోస్టును ఏర్పాటు చేసి ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేసే వాహనాలను పట్టుకుని జీవోనెంబర్ 100 ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. డివిజన్ పరిధిలో ప్రత్యేక టీంతో పాటు ఆయా మండలాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టంలో కీలకంగా పనిచేయాలన్నారు. డివిజినల్ అధికారుల బృందంలో ఆర్డీవో, డీడీవో, డీఎస్పీలు వ్యవహరిస్తారని, మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఈవోపీఆర్‌డీ, ఎస్‌హెచ్‌వోలు వ్యవహరిస్తారని, గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీసు, వీఆర్‌ఏలు గ్రామ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రభుత్వ నిబంధనలు, జిల్లా కలెక్టర్ ఆదేశాలను విధిగా అమలు చేసి అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేయాలని ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు సూచించారు. చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల తహసీల్లారు కె.గోపికృష్ణ, గీతారాణి, జె.ప్రభాకరరావు, ఎంపీడీఓలు విజయ, రాజేష్‌బాబు, ఈవోఆర్డీలు, ఎస్సైలు, ఆర్‌ఐలు, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


