ఏకాగ్రతతో వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చు
చీరాల: డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖాధికారి టి.కె.పరంధామరెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం చీరాలలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో లారీ, టాక్సీ డ్రైవర్లుకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమేనని, రోడ్డు కండీషన్, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని పరిమిత స్పీడ్‌తో వాహనాలను నడపాలని అన్నారు. ప్రమాదాల నివారణకు డ్రైవింగ్‌లో ఏకాగ్రత అవసరమన్నారు. రహదారులపై వాహనాలను నిలుపవద్దని డ్రైవర్లను ఆయన కోరారు. చీరాల డిఎస్పీ ఎండి మొయిన్ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రమాదాలలో మరణిస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. నిద్రమత్తు కూడా ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ డ్రైవర్లందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే డ్రైవర్లు సురక్షితమైన డ్రైవింగ్ చేయగలుగుతారన్నారు. డ్రైవర్లుకు బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీరాల మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బి.రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.రవినాయక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.మురళీమోహన్, సెక్రటరీ వి.చంద్రబాబు, చీరాల టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.మోజెస్, డ్రైవర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్‌లో..
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డ్రైవర్లుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చీరాల ట్రాఫిక్ ఎస్సై కె.పవన్‌కుమార్ హాజరయ్యారు. డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో ఎంతో ఏకాగ్రతతో ఉండాలన్నారు. ప్రమాదం ఎటునుంచి వస్తుందో చెప్పలేమన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జంజనం శ్యామల పాల్గొన్నారు.
జిల్లా రవాణా శాఖ అధికారి
టి.కె.పరంధామరెడ్డి


