ప్రొటోకాల్‌కు అధికారుల మంగళం!
గ్రామసభకు పిలిచి వేదికపై స్థానం ఇవ్వకుండా వైఎస్సార్ సీపీ జడ్పీటీసీని అవమానించిన వైనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వేదికపై ఓ మూలన చోటు టీడీపీ స్థానిక నేతలచే సభ నిర్వహణ
మేడికొండూరు: అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వడం లేదు. కేవలం టీడీపీ నేతల అండతోనే వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ప్రకారం గౌరవించకుండా అవమానాలకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడికొండూరు మండల పరిధిలోని డోకిపర్రు సచివాలయం వద్ద మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వైఎస్సార్ సీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు కందుల సిద్ధయ్యకు అధికారులు ఆహ్వానం పలికారు. స్థానిక పంచాయతీ అధికారి ఆహ్వానం మేరకు గ్రామసభకు వచ్చిన జడ్పీటీసీ సిద్ధయ్యకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సభ వేదికపై టీడీపీ చోటా నాయకులు కొలువుదీరారు. జడ్పీటీసీ సిద్ధయ్య వేదిక వద్దకు వచ్చినా.. వేదికపైకి ఆహ్వానించలేదు. తనకు ప్రొటోకాల్ పాటించకపోవడంపై సిద్ధయ్య ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్థానిక పంచాయతీ అధికారి షేక్ జిలానీ స్టేజిపైకి పిలిచి, చివరన కూర్చోబెట్టారు. అధికారులు టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం ఇవ్వకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


