11న ఏపీ టీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ ఉద్యమ సారథి నూతలపాటి పరమేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా ఈనెల 11న ఏపీ టీఎఫ్ ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యాసదస్సులో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవలింగారావు, మహమ్మద్ ఖాలీద్‌లు పిలుపునిచ్చారు. కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం విద్యాసదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.బసవలింగారావు మాట్లాడుతూ గత 80 ఏళ్లుగా ఆంధ్రనాట విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి ఏపీటీఎఫ్ కృషి చేస్తోందని అన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ఏపీటీఎఫ్ సంఘంలో పరమేశ్వరరావు కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు, జి.దాస్, జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీనారాయణ, పి.శివరామకృష్ణ, ఎస్.సత్యనారాయణ మూర్తి, కేసన రమేష్, ఆర్.బలరాజు, సిద్దిక్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.


