రోడ్డు ప్రమాదంలో చిరుద్యోగి మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారి, కుంచనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన కామినేని భవానీశంకర్ (33) కుటుంబ జీవనోపాధి కోసం విజయవాడలోని ఓ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి స్టాక్ రావడంతో వాటిని చూసుకొని 12 గంటల తరువాత ఇంటికి వెళుతుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న కారు భవానీశంకర్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో భవానీ శంకర్‌కు తీవ్ర గాయాలుకాగా, కారులో వైద్య నిమిత్తం దగ్గరలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తాడేపల్లి పోలీసులు అక్కడి నుండి తీసుకువచ్చి విచారణ చేపట్టారు.


