నాటకరంగాన్ని భావి తరాలకు అందించాలి
యద్దనపూడి: అంతరించిపోతున్న నాటక కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గుదె పాండు రంగారావు అన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యాన ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కమిటీ సభ్యులతో ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మార్టూరు శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడు జాష్టి మోహన్‌రావు, కారుమంచి కళా పరిషత్ అధ్యక్షుడు కె.రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడు మోహన్‌రావు మాట్లాడుతూ తెలుగు నాటకరంగం ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిందని కానీ నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారిపోతోందన్నారు. తెరపడే నాటకరంగానికి ఎంతోమంది కళాపరిషత్‌లు ద్వారా నాటకరంగానికి జీవం పోస్తున్నారన్నారు. కారుమంచి కళాపరిషత్ అధ్యక్షుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని ఎందరో మహనీయులు తమ రచనల ద్వారా నాటక ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు. గుదే పాండురంగారావు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించిన నాటకపోటీలు నాలుగో సంవత్సరం కూడా నిర్వహించేందుకు గ్రామస్తులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుదే తారక రామారావు, రావిపాటి సీతయ్య, కొరిటాల వంశీకృష్ణ, ఈశ్వరప్రసాద్, మద్దినేని గోపాలకృష్ణ, పోపూరి నాగేశ్వరావు, హనుమంతురావు, నిమ్మల సాంబశివరావు, శానంపూడి లక్ష్మయ్య, జ్యోతిబాబు, పెరవల్లి శ్రీనివాసరావు, రావి శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.


