నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
చీరాల: చీరాల్లోని రెండు ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైందని హైకోర్టు న్యాయవాది రజని అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చీరాల కొత్తపేటకు చెందిన పి.సౌమ్య అనే మహిళ డిసెంబర్ 20న కాన్పు కోసం చీరాలలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేరిందన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని గంటలకు ఆమెను హడావిడిగా చీరాల్లోని మరో ప్రముఖ హాస్పిటల్‌కు పంపించారన్నారు. డెలివరీ అయిన గంటల వ్యవధిలోనే ఆమె చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతమన్నారు. కనీసం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏలా ఉందనేది కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడం దారుణమని తెలిపారు. గంటల కొద్దీ హాస్పిటల్స్‌లో ఉంచుకోవడం వలనే ఆమె చనిపోయిందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ముందుగానే చెబితే వారి స్థోమతను బట్టి వేరే ప్రాంతానికి తీసుకొనివెళ్లే వారన్నారు. ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం వలనే ఆమె మరణించిందని ఆరోపించారు. మృతురాలికి ఏ వైద్యం చేశారనేది కూడా కేసు షీటు గాని, డిశ్చార్జి సమ్మరీ గాని ఇవ్వలేదన్నారు. బాధితులు ఈ విషయమై పోలీసులను ఆశ్రయించినా పోలీసులు వైద్యులపై కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఆమె మృతికి కారణమైన వైద్యులపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.వసంతరావు, ఎం.ప్రతాప్, ఎం.రాజా, మృతురాలి తండ్రి పి.ఏడుకొండలు పాల్గొన్నారు.
చీరాల: వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందిన సంఘటనపై శనివారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కొత్తపేటకు చెందిన పి.సౌమ్య(30) అనే గర్భిణి గత నెల 12న చీరాలలోని శంకర్ ల్యాప్రోస్కోపీ ఇన్‌ఫెర్టిలిటీ హాస్పిటల్‌లో చేరింది. 16న సిజేరియన్ ఆపరేషన్ చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ జరిగి గంటలు గడిచినా థియేటర్‌లో నుంచి తల్లిని బయటకు తీసుకురాకపోవడంతో బంధువుల ఆందోళన చెందారు. దీంతో ఆమెను రాత్రి 10 గంటల సమయంలో మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తరలించగా మార్గమధ్యంలో మరణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత మృతికి కారణమైన డాక్టర్ రామకృష్ణ హనుమాన్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్.సుబ్బారావు తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకంపై బాధితుల ఆందోళన


