హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 128 విశ్వవిద్యాయాల జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. సుమారు 896 మంది క్రీడాకారులు తలపడనున్నట్లు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ మాట్లాడుతూ జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు పోటీలు జరుగనున్నాయని తెలిపారు. యువత క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె.హరి కిషోర్ మాట్లాడుతూ తమ వర్సిటీలో క్రీడాకారులకు ఫీజు రాయితీతోపాటు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ జాయింట్ సెక్రటరీ పున్నయ్య చౌదరి, ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు, వర్సిటీ ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్‌రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
తొలి రౌండ్‌లో 60 జట్లు విజయం
పోటీల వివరాలను వర్సిటీ సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ హరికిషోర్ వెల్లడించారు. తొలిరోజు మొదటి రౌండ్‌లో మొత్తం 128 జట్లు పోటీ పడగా 60 జట్లు గెలుపొందగా, 4 పోటీల ఫలితాలు డ్రాగా ముగిసినట్లు తెలిపారు. ఏపీకి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు యూనివర్శిటీపై తమిళనాడుకు చెందిన భారతీయార్ యూనివర్సిటీ జట్టు విజయం సాధించిందని, తమిళనాడుకు చెందిన తిరువళ్లువర్ యూనివర్సిటీపై హైదరాబాద్‌కు చెందిన జేఎన్‌టీయూ వర్సిటీ జట్టు గెలిచిందని పేర్కొన్నారు. ఆదివారం రెండో రౌండ్ పోటీలు ఉంటాయని వివరించారు.


