మోంథా దెబ్బకు కోతకు గురైన తీరం | - | Sakshi
Sakshi News home page

మోంథా దెబ్బకు కోతకు గురైన తీరం

Nov 3 2025 6:56 AM | Updated on Nov 3 2025 6:58 AM

పర్యాటకులకు అనుమతి లేదు

బీచ్‌ల వద్ద కార్తిక స్నానాలపై నిషేధం తీరాలకు వెళ్లే రహదారులు మూసివేత పర్యాటకులకూ అనుమతి నిరాకరణ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

బీచ్‌లు మూసివేత

పర్యాటకులకు అనుమతి లేదు

బాపట్ల/చీరాలటౌన్‌/వేటపాలెం: చీరాల, రామాపురం బీచ్‌లు పర్యాటకులతోపాటు పుణ్య స్నానాలు చేసే భక్తులకు ఆతిథ్యం ఇస్తుంటాయి. ఈ క్రమంలో కార్తిక మాసంలో వచ్చే సోమ, మంగళవారాల్లో భక్తులు స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటీవల సంభవించిన మోంథా తుపాను ప్రభావంతో సముద్రతీరంలో పది రోజులపాటు పోలీసులు సందర్శకులను నిషేధించారు. మోంథా కారణంగా వాడరేవు, రామాపురం, ఇకఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామ చంద్రాపురం సముద్ర తీరాల్లో కోతలు, గుంతలు ఏర్పడ్డాయి. పోలీసులు, గజ ఈతగాళ్లతో తీరప్రాంతాల్లో పరిశీలించి వాతావణం అనుకూలంగా లేకపోవడంతో కార్తిక పౌర్ణమి, సోమవారాల్లో సముద్ర స్నానాలకు వెళ్లకుండా నిషేధించారు.

బీచ్‌లో ప్రమాదకరంగా...

ఏడాది పొడువునా బీచ్‌లకు పర్యాటకులు వస్తుంటారు. వారాంతాలు, సెలవు దినాల్లో వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువ. కార్తిక మాసంలో సుమారు 2 లక్షల మంది సందర్శిస్తుంటారు. సరైన భద్రత చర్యలు చేపట్టకపోవడంతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. చీరాల తీరం కోతకు గురై గుంతలు ఏర్పడ్డాయని మత్స్యకారులు చెబుతున్నారు. అలలు పెద్దగా వచ్చినప్పుడు కాళ్ల కింద ఇసుక కోతకు గురవుతుంది. దీనినే నిపుణులు అండర్‌ కరెంట్‌గా పేర్కొంటారు. ఇలా పెద్ద అలలు, కాళ్ల కింద ఇసుక కోత జరిగినప్పుడు సముద్రంలో ఉన్నవారు శరీరంపై నియంత్రణ కోల్పోయి. వెంటనే కొట్టుకుపోతారు. అందుకే బీచ్‌లల్లో సేఫ్‌ జోన్‌ ప్రాంతాలు గుర్తించి భద్రత కట్టుదిట్టం చేసే వరకు సందర్శకులను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. ఆంక్షలను అందరూ పాటించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మోంథా కారణంగా వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో కార్తిక మాస స్నానాలకు ఈ నెల 4 తేదీ వరకు అనుమతి లేదని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర్‌ నాయుడు తెలిపారు. ఆదివారం వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో ఏర్పడిన గండ్లతో పాటు తీరాన గుంతలు ఏర్పడటంతో స్నానాలకు అనువుగా లేదని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ కె.గోపికృష్ణ, మత్స్యశాఖ ఏడీ కృష్ణ కిషోర్‌, మండల ఆర్‌ఐ శేఖర్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. తుఫాన్‌ ప్రభావంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం, మంగళవారాలలో సముద్రంలో స్నానాలకు అనుమతి లేదని చీరాల ఆర్డీఓ పి.గ్లోరియా ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు గమనించాలని సూచించారు.

మోంథా తుఫాన్‌ ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురైంది. ప్రమాదకరంగా మారినందున కార్తిక స్నానాలకు అనుమతి నిరాకరించాం. నిపుణుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కార్తిక మాసంలో భక్తులు, పర్యాటకులు సముద్రం వైపు రాకూడదు.

– ఏడీ మొయిన్‌, డీఎస్పీ, చీరాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement