అన్నదాతల కన్నీటి వ్యథ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల కన్నీటి వ్యథ

Nov 3 2025 6:58 AM | Updated on Nov 3 2025 6:58 AM

అన్నదాతల కన్నీటి వ్యథ

అన్నదాతల కన్నీటి వ్యథ

అన్నదాతల కన్నీటి వ్యథ అయిదు రోజులుగా వరదలోనే వరి పొలాలు

పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాంలలో దుస్థితి దాదాపు 60 వేల ఎకరాల పంట నీట మునక పర్చూరు వాగు, రొంపేరుల్లో పూడికతీతపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఈపూరుపాలెం, వేటపాలెం స్ట్రెయిట్‌ కట్‌ల నుంచి సముద్రంలోకి వెళ్లని వరద నాలుగు మండలాల్లో చాలావరకు కుళ్లిన పంట దాదాపు రూ. 300 కోట్ల వరకు నష్టపోయినట్లు అంచనా కూటమి సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు కోలుకోలేని దెబ్బ

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలకు కన్నీటి వ్యథ తప్పడం లేదు. తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీట మూటలయ్యాయి. చేతికొచ్చిన పంట వరదలోనే అయిదురోజులుగా మునిగి పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ముందుగానే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని వారు వాపోతున్నారు. ఇకనైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అయిదు రోజులుగా వరదలోనే వరి పొలాలు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి సర్కారు చెబుతున్నది వాస్తవ విరుద్ధమని బాపట్ల జిల్లాలో పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. వర్ష బీభత్సంతో జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కూటమి సర్కార్‌ నిర్లక్ష్యంతో మరో 60 వేల ఎకరాల్లో వరి పంట అయిదు రోజులుగా వరద నీటిలో మునిగి ఉంది. ఇప్పటికే సగం పంట కుళ్లిపోగా.. మిగిలింది నేడో రేపో అలాగే కానుంది.

ఏడాదిన్నర క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పర్చూరు, చీరాల నియోజకవర్గాల పరిధిలో ఉన్న పర్చూరు,రొంపేరు, ఈపూరుపాలెం, వేటపాలెం వరద కాలువల్లో పూడిక, గుర్రపుడెక్కను తొలగించలేదు. దీంతో వరదనీరు సముద్రంలోకి వెళ్లే దారిలేక పంట పొలాలను ముంచెత్తింది. ఇది సర్కారు పాపమేనని ఈ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుఫాన్‌ ప్రభావంతో గత సోమవారం, మంగళవారాలలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పర్చూరు, చీరాల ప్రాంతాల్లో అత్యధికంగా 26 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గాలతోపాటు పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు, మార్టూరు, యద్దనపూడి ప్రాంతాల్లో పలు వాగులు పొంగి ప్రవహించాయి. పర్చూరు వాగు ఉప్పొంగింది. ఇది మార్టూరు వద్ద రొంపేరు వాగుగా మారి అక్కడి నుంచి కుడి కాలువ (వేటపాలెం స్ట్రెయిట్‌ కట్‌), ఎడవ కాలువ (ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌)లుగా విడిపోయి బాపట్ల, వేటపాలెం మండలాల పరిధిలో సముద్రంలో కలుస్తుంది. ప్రధాన కాలువల్లో గుర్రపుడెక్క తదితర పూడిక విపరీతంగా పెరగడంతో వరద నీరు సముద్రంలోకి వెళ్లే దారి లేకుండా పోయింది. దీంతో వరద ఎగదన్ని కాలువలు పొంగాయి. పర్చూరు ప్రాంతంలోని నాగుల పాలెం, పర్చూరు, ఉప్పుటూరు గ్రామాలతోపాటు కారంచేడు మండలంలో కారంచేడు, కుంకలమర్రి, ఆదిపూడి, స్వర్ణ, ఎర్రంవారి పాలెం గ్రామాలు, చీరాల పరిధిలోని పొలాలు కలిపి 25 వేల నుంచి 30 వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. వేటపాలెం మండలంలో దేశాయిపేట, వేటపాలెం, రామన్న పేట, పందిళ్లపల్లె, చల్లారెడ్డిపాలెం, పాపాయిపాలెంపరిధిలో మరో 9 వేల ఎకరాలు ముంపులోనే ఉంది. చినగంజాం మండలంలో చింతగుంపల, గొనసపూడి, సంతరావూరు, కడవకుదురు, మున్నంవారి పాలెం, పెదగంజాం, చినగంజాం గ్రామాల పరిధిలో దాదాపు 30 వేల ఎకరాల వరిపంట నీట మునిగింది. తుఫాన్‌ ప్రభావంతో వర్షం కురిసి ఇప్పటికి అయిదు రోజులు ముగిసినా 60 వేల ఎకరాల పంట మొత్తం నీటిలోనే ఉంది. రెండు, మూడు రోజులపాటు పంట పొలాల్లో నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

నాడు వైఎస్సార్‌ చర్యలకు అడ్డంకులు

2007లో తుపాను ప్రభావంతో ఇప్పటి మాదిరిగానే భారీగా వరదలు వచ్చి పర్చూరు వాగుతోపాటు రొంపేరు కాలువలు పొంగి పొర్లాయి. పరిస్థితిని చూసేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. రైతులు తమ కష్టాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మొదలు పర్చూరు మీదుగా పలు వాగులు ఇటుగా వచ్చి పంట పొలాలను ముంచెత్తుతున్నాయని వివరించారు. పర్చూరు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు మీదుగా గుండ్లకమ్మ నది వరకూ డ్రైన్‌ నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పారు. దీంతో నిర్మాణానికి అంచనాలు తెప్పించిన ఆయన రూ. 150 కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు అని, దీంతో ఉపయోగం లేదని పచ్చ నేతలు తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించారు. కాలువ కోసం భూ సేకరణ చేస్తే తమ పొలాలు పోతాయని, ఇదే జరిగితే ఎన్నికల్లో తమ సామాజికవర్గం ఓట్లేయదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి పురందేశ్వరిపై పచ్చనేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. కాలువ వద్దంటూ వారు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని నిలువరించారని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. నాడు కాలువ నిర్మించి ఉంటే ఈ రోజు వరద వల్ల పంటలు నీట మునిగేవి కావని, పచ్చ నేతల కుట్రలవల్లే ఈ దుస్థితి పట్టిందని పలువురు రైతులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement