11 ఏళ్లకే 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు
భట్టిప్రోలు: పిట్ట కొంచెం కూత ఘనం అనే చందాన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 7వ తరగతి విద్యార్థిని బిట్రా సహిత 11 ఏళ్ల వయసులో 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు పూర్తిచేసింది. తాతయ్య, నాయనమ్మలు బిట్రా బాలాజీ – విజయలక్ష్మి ప్రోత్సాహంతో తల్లిదండ్రులు రఘు శిరీష దంపతులు చిన్నారిని ప్రోత్సహించారు. సహిత 2021 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చింది. కార్తిక మాసం సందర్భంగా ప్రదర్శన ఇచ్చేందుకుగాను భట్టిప్రోలుకు వచ్చి రుక్మిణి ప్రవేశంలో వెంపాటి చిన సత్యం మాస్టార్ రచించిన తరుణి రుక్మిణి పాటకు నాట్య ప్రదర్శన ఇచ్చింది. ఏలూరులో నర్తన బాల బిరుదును, విజయవాడ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయం వారిచే నటరాజ అవార్డు, తిరుపతిలో మూడు సార్లు జాతీయ స్థాయిలో హనుమ అవార్డును సహిత అందుకుంది.
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజలు సమస్యల అందజేసే అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భావన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.
నకరికల్లు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో మొసలి సంచారం కలకలం రేపింది. నకరికల్లు–కారంపూడి రహదారికి ఆనుకొని గుండ్లపల్లి వద్ద చెరువు ఉంది. చెరువు నుంచి రహదారిపైకి శనివారం అర్ధరాత్రి దాటాక మొసలి వచ్చింది. రోడ్డుపై పాకుతూ వెళ్తున్న సమయంలో గ్రామస్తుల కంటపడింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువకులు ధైర్యం చేసి మొసలి ఇళ్లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుండ్లపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం.శ్యాం కుమార్ క్రొకోడైల్ క్యాచర్స్ సహాయంతో మొసలిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో తరలించి కృష్ణానదిలో వదిలారు.
యడ్లపాడు: కొండవీడుకోట సందర్శనకు పర్యాటకులు రావద్దని పల్నాడు జిల్లా అటవీ అధికారి జి.కృష్ణప్రియ తెలిపారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో కొండవీడు కోట సందర్శకులను అనుమతించని విషయం తెలిసిందే. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కొండపై నుంచి భారీ బండరాళ్లు జారి ఘాట్‌రోడ్డుపై పడ్డాయి. వాటిని తొలగించే ప్రక్రియను అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే కొండవీడుకోట సందర్శనకు రావద్దని ఇటీవల ప్రకటించారు. ఆదివారం ఘాట్ రోడ్డులో జరుగుతున్న తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండలపై నుంచి ఊట నీటితోపాటు బండరాళ్లు జారే ప్రమాదం ఉందని తెలిపారు.
అమరావతి: కార్తిక మాసం రెండో ఆదివారం సందర్భంగా అమరావతి బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేకువజామున భక్తులు తొలుత పవిత్ర కృష్ణా నదిలో కార్తిక పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తిక దీపాలు వెలిగించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈఓ రేఖ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
11 ఏళ్లకే 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు
11 ఏళ్లకే 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు
11 ఏళ్లకే 100 కూచిపూడి నాట్య ప్రదర్శనలు


