మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక సందడి
కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేసిన భక్తులు శివనామ స్మరణతో మార్మోగిన శివాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు ఒక్కరోజులో స్వామి వారి ఆదాయం రూ.6.50 లక్షలు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కళకళలాడింది. ఆలయ ప్రాంగణం కార్తిక దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది. కార్తికమాసం రెండో ఆదివారం పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల సందడి ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. శివాలయంలో సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ప్రాంగణం ఓం నమఃశివాయ నామంతో మార్మోగింది. భక్తులు భ్రమరాంబమల్లేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం త్వరగా జరిగేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్‌లలో దాతల సహకారంతో భక్తులకు ఉచితంగా పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. నిత్య అన్నప్రసాద భవనంలో అన్న సంతర్పణ జరిగింది. ప్రతి భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం ఆకాశదీపాన్ని వెలిగించి పూజలు చేశారు. వివిధ సేవా కార్యక్రమాలు, ప్రసాద విక్రయాల ద్వారా స్వామివారికి రూ.6,50,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు.


