తప్పిపోయిన బాలురు కన్నవారి చెంతకు..
అడ్డంకి: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు కనిపించకపోవడంతో శనివారం కేసు నమోదైంది. 24 గంటల్లో పోలీసులు తప్పిపోయిన బాలురను వెతికి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. వివరాలు.. శనివారం ఉదయం ప్రభుత్వ సామాజిక సంక్షేమ బాలుర వసతి గృహం–1కి చెందిన 10వ తరగతి విద్యార్థులు ధనుష్ (15), పొతురెడ్డి సుబ్బారెడ్డి (15) పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పల్లెపోగు వీరాస్వామి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో చీరాల డీఎస్పీ ఆధ్వర్యంలో, అద్దంకి సీఐ సుబ్బరాజు ఆరు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి, అద్దంకి, ఒంగోలు, చిలకలూరిపేట, మార్టూరు, మెదరమెట్ల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించడంతో పాటు, బస్ స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద సమగ్ర విచారణ నిర్వహించారు. ఎట్టకేలకు మేదరమెట్ల బస్ స్టాండ్ వద్ద బాలురను సురక్షితంగా గుర్తించారు. తప్పిపోయిన బాలురను సమర్థవంతంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులను అధికారులు ప్రశంసించారు.


