సినీ నటులపై చర్యలు కోరుతూ ఆందోళన
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొరియోగ్రాఫర్ శష్టి వర్మ, సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం డిమాండ్ చేశారు. గుంటూరు లాలాపేటలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం నిరహార దీక్ష చేపట్టారు. పోలీసులు బలవంతంగా దీక్షను విరమింపజేసే ప్రయత్నం చేయగా కరీం పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే యత్నం చేశారు. పోలీసులు తక్షణమే అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. కరీం మాట్లాడుతూ మహాత్ములను అవమానించిన సినీ నటులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు కనీస చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసు రిజిస్టర్ చేశారన్నారు. మహాత్ములను కించపర్చిన వారిపై చట్ట ప్రకారం శిక్షించే వరకు మా పోరాటం ఆగదని డిమాండ్ చేశారు. లాలాపేట పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు
పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేసిన కరీం
అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన
లాలాపేట పోలీసులు


