
అమరేశ్వరునికి పుష్పార్చన
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో గురువారం లోక కల్యాణార్థం దాతల సహకారంతో స్వామికి పుష్పార్చన నిర్వహించారు. తొలుత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి సహస్ర నామాలతో రుత్విక్కులు పుష్పార్చన జరిపారు. అనంతరం బాల చాముండికా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.
రాజ్యలక్ష్మీఅమ్మవారికి
బంగారు హారం బహూకరణ
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి దాత బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ డిప్యూటీ కమిషనర్ పర్యటన
గుంటూరు రూరల్: వెంగళాయపాలెంలో మహాత్మాగాంధీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ వాటర్ షెడ్ ప్రోగ్రాం డిప్యూటీ కమిషనర్ సాగర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్‌లు గురువారం పర్యటించారు. గ్రామ పంచాయతీలో 21.38 ఎకరాల ఊర చెరువు ఉంది. వాటర్ షెడ్, అమృత్ సరోవర్ పథకాలలో భాగంగా చెరువుకు రివిట్‌మెంట్, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ నల్లపాటి లలితకుమారి, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రవి, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో శ్రీరామ్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నగదు రహిత చికిత్స
అందించాలి
గుంటూరు వెస్ట్: ఉద్యోగ, ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా కోరారు. ఈ మేరకు గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ నెట్‌వర్క్ ఆసుపత్రుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సేవకు అంకితమైన ఉద్యోగుల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు యు.సుమిత్రా దేవి, సంయుక్త కార్యదర్ళులు కోటా సాహెబ్, వి.కార్తిక్, కోశాధికారి శ్రీనివాస్, మహిళా విభాగం నాయకులు రమణి, మయూరి పాల్గొన్నారు.

అమరేశ్వరునికి పుష్పార్చన