
అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్
రూ. 8 లక్షల సొత్తు రికవరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదు
బాపట్ల టౌన్ : ఇళ్లలో బంగారు అభరణాలు, నగదు చోరీ చేసే గజదొంగను బాపట్ల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీసీఎస్ డీఎస్పీ బి. జగదీష్‌నాయక్ గురువారం వెదుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామానికి చెందిన కోడిరెక్క విజయ్‌కుమార్ తాపీమేస్త్రిగా జీవనం సాగిస్తుండేవాడు. చెడు వ్యసనాలకు లోనై సులభ రీతిలో డబ్బు సంపాదించేందుకు దొంగ అవతారమెత్తాడు. ఓ దొంగతనం కేసులో తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్ పోలీసులు 2022లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై వచ్చి యడ్లపాడు గ్రామంలో తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో చిలకలూరిపేట, యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డాడు. చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. బెయిల్‌పై వచ్చిన జగదీష్‌నాయక్ మరలా ఈ ఏడాది అద్దంకి, సంతమాగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడాడు. ఇతడి కదలికలపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు గురువారం ఉదయం అద్దంకి–మేదరమెట్ల బైపాస్ రోడ్డు జంక్షన్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 30 వేలు విలువ చేసే వెండి అభరణాలు, రూ. 1.15 లక్షల నగదుతో పాటు రూ. 70 వేలు విలువ చేసే ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీసీఎస్ సీఐ పి.ప్రేమయ్య, అద్దంకి పట్టణ సీఐ ఏ.సుబ్బరాజు, సీసీఎస్ ఎస్.ఐ బి.రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. కేసును ఛేదించడానికి విశేష కృషిచేసిన సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, సీఐ పి.ప్రేమయ్య, ఎస్‌ఐ బి.రాంబాబు, కానిస్టేబుళ్లు ఎస్.కోటేశ్వరరెడ్డి, కె.చిరంజీవి, డి.వై.దాసు, కృష్ణలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు.