
ప్రజా సంక్షేమం కోసమే జీఎస్టీ తగ్గింపు
చీరాల రూరల్: ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చేసిందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజల పెనుభారాన్ని తగ్గించేందుకు గతంలో నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీని ప్రస్తుతం రెండుగా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వి. వినోద్‌కుమార్, గుంటూరు జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని బాపట్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో రావినూతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం విశేష ప్రతిభ కనపరచారు. బాపట్లలో గురువారం ‘సేవ్ ది గర్ల చైల్డ్’ అనే అంశంపై వక్తృత్వ పోటీ నిర్వహించారు. ఇందులో రావినూతల హైస్కూలుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కె.హనీ జిల్లాస్థాయిలో రెండో స్థానం, చిత్రలేఖనం పోటీలో పదో తరగతి విద్యార్థిని ఎం.వర్ష ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఈనెల 11న నిర్వహించే బహుమతి ప్రదానోత్సవంలో రూ. 3 వేలు, రూ. 5 వేల చొప్పున అందుకోనున్నట్లు పాఠశాల హెచ్‌ఎం రాఘవరెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.
నగరంపాలెం: విశ్రాంత పోలీస్ అధికారి ఎన్.గోపాలరావు (87) అంత్యక్రియలు గురువారం జరిగాయి. బుధవారం డొంకరోడ్డులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపాలరావుకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1961లో ఎస్‌ఐగా పోలీస్ శాఖలో చేరి సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీగా విధులు నిర్వహించారు. ఏపీ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎం.రంగాప్రసాద్, కోశాధికారి డాక్టర్ కేవీ నారాయణ తదితరులు నివాళులర్పించారు.