
మనోవ్యాధులకూ మంచి ఔషధాలు
ప్రతి ఏడాది పెరుగుతున్న మానసిక సమస్యలు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
గుంటూరు మెడికల్: జిల్లాలో 25 మంది మానసిక వ్యాధి వైద్య నిపుణులున్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 30 నుంచి 50 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రోజూ 160 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏడాది మానసిక రోగుల సంఖ్య పెరిగపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో సైతం సమస్యలు రావటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు ఇవీ..
చిరాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పైబడి ఉంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువు పెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరినీ ఇబ్బందికి గురి చేయడం, తాను కూడా ఇబ్బందులకు గురవ్వటం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాలు వరకు వెళ్లటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. రోటీన్ లైఫ్‌కు భిన్నంగా ఉండే ప్రవర్తన కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉన్నట్లు గుర్తించాలి. చదువుకునేందుకు ఆసక్తి చూపించకపోవటం, ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లకే పరిమితమవ్వటం, ఉద్యోగం, ఇతర పనులు చేయకుండా ఉండిపోవటం లక్షణాలు వ్యాధి బాధితుల్లో ఉంటాయి.
గుంటూరు జీజీహెచ్‌లో
చికిత్స పొందిన వారి వివరాలు..
ఏడాది రోగుల సంఖ్య
2023 22,189
2024 30,553
కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరో గ్యానికి , వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.