పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ

Oct 10 2025 6:32 AM | Updated on Oct 10 2025 6:32 AM

పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ

పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ

చోరీ చేసిన సొత్తుతో దంపతుల జల్సాలు పదమూడు కేసులు నమోదైనా ఏమీ తెలియనట్టు గ్రామంలో మకాం ఇళ్లల్లో చోరీలకు పాల్పడే భర్త, భార్య అరెస్ట్‌

నగరంపాలెం: పగలు పల్సర్‌ బైక్‌పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్‌ చేశారని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్‌, టీవీ, ఇనుపరాడ్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్‌ డివిజన్‌ డీఎస్పీ బి.జనార్దనరావు, రూరల్‌ సీఐ ఆర్‌.ఉమేష్‌ నేతృత్వంలో కొల్లిపర పీఎస్‌ ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్‌ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్‌ బైక్‌, ఒక టీవీ, ఇనుపరాడ్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఇనుపరాడ్‌తో తాళాలు పగులకొట్టి..

గతంలో వెంకటేశ్వర్లు బేల్దారి పనులకు వెళ్లేవాడు. భార్యాభర్తలు కొద్దికాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. భర్త ద్విచక్ర వాహనం (పల్సర్‌)పై వెళ్లి ఇళ్లకు తాళాలు వేసిన గృహాలను గుర్తించే వాడు. ఆ తర్వాత ఇరువురు కలసి చోరీకి వెళ్లేవారు. భర్త ఇనుపరాడ్డుతో తలుపులు పగలుకొట్టి, బంగారం, వెండి వస్తువులు, నగదుతో రెప్పపాటులో ఉడాయించేవాడు. భార్య ఘటనా స్థలంలో ఉండి వచ్చే, పోయే వారి కదలికలను గుర్తించేది. చోరీలకు పాల్పడి వచ్చాక ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయేవారు. దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేయడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేవారు. నిందితుడైన వెంకటేశ్వర్లుకు పాత నేర చరిత్ర ఉంది. దాదాపు 13 కేసులు నమోదై ఉన్నాయి. త్వరితగతిన కేసు ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, తెనాలి రూరల్‌ పీఎస్‌ సీఐ ఆర్‌.ఉమేష్‌, కొల్లిపర పీఎస్‌ ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, హెచ్‌సీలు రామకోటేశ్వరరావు, మురళీకృష్ణ, పీసీలు కూర్మారావు, శివరామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement