
డీఎంఎఫ్ పనుల్లో పురోగతి కన్పించాలి
బాపట్ల: డీఎంఎఫ్ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రతి వారం పురోగతి కన్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అభియాన్, పబ్లిక్ హెల్త్, సీపీఓ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా జిల్లా ఏర్పడిన నాటికి రూ.35 కోట్లు డీఎంఎఫ్ నిధులు ఉన్నాయని తెలిపారు. అప్పటి నుంచి మూడున్నర ఏళ్లలో మరో రూ.16 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. డీఎంఎఫ్ కింద మొత్తం రూ.51 కోట్లు ఉండగా, వివిధ శాఖల ద్వారా 31 పనులకు గానూ రూ.48.28 కోట్లు అధికారికంగా మంజూరయ్యాయని వివరించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.5.77 కోట్ల పనులు మాత్రమే జరగడమేమిటిని ఆయన ప్రశ్నించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల ఓడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు నిర్మిస్తున్న 167ఏ జాతీయ రహదారిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రూ.1,065 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులు జిల్లాలో 95 శాతం పూర్తయ్యాయని, నవంబర్ నెలాఖరకు ముగించాలని చెప్పారు.
అంతర్గత రోడ్లు వేగంగా నిర్మించాలి
కలెక్టరేట్‌లో అంతర్గత రహదారులను ఆర్ అండ్ బీ అధికారులు వేగంగా నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. అంతర్గత రహదారులు, ఏటీఎం గది ప్రతిపాదిత ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ.47.9 లక్షలతో ప్రతిపాదించిన అంతర్గత రహదారి ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఆర్ అండ్ బీ డీఈ అరుణకుమారి, అధికారులు ఉన్నారు.
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్