
క్వారీ అనుమతులు రద్దు చేయాలి
నరసరావుపేట: బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో భద్రత చర్యలు తీసుకోని యాజమాన్యంపై చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1కోటి నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం క్వారీ ప్రమాద స్థలంతో పాటు నరసరావుపేట పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులకు మించి క్వారీలో లోతులోకి వెళ్లి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే క్వారీ యజమానులు ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు కన్పించట్లేదన్నారు. రెవెన్యూ, కార్మిక శాఖ, మైనింగ్ శాఖ పర్యవేక్షణ లోపించడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని అన్నారు.
డిమాండ్ చేసిన పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు