
అంగన్‌వాడీలకు ‘యాప్’సోపాలు
చీరాల అర్బన్: జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు తొమ్మిది ఉన్నాయి. వీటిలో 1888 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న చిన్నారులు 69,217 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషణ అందించడంతోపాటు గర్భిణులకు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పోషణ అందించడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో కొత్తగా యాప్‌లు తీసుకువచ్చారు. అందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్లను అంగన్‌వాడీలకు అందించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పోషణ సరఫరాలో ప్రత్యేక యాప్‌లలో పలుమార్లు నమోదు చేయాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల సంజీవిని యాప్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోషణ ట్రాకర్ యాప్‌తో కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. పోషణ్ ట్రాకర్ యాప్‌లో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్)/బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోయినా, లబ్ధిదారుల మొబైళ్లలో మెసేజ్ బ్యాలెన్స్ లేక ఓటీపీలు రాకపోయినా సరుకులు అందించలేని పరిస్థితి ఉంది.
యాప్‌లే యాప్‌లు
అంగన్‌వాడీలతోపాటు లబ్ధిదారులు కూడా యాప్‌ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పోషణ్ ట్రాకర్ యాప్‌లో గర్భిణి, బాలింత, టీహెచ్ పిల్లల వివరాలు నమోదుతోపాటు వారికి ఎఫ్‌ఆర్‌ఎస్, ఈకేవైసీ, ఆధార్ ఫేస్ మ్యాచింగ్ చేయాలి. కొంతమంది లబ్ధిదారులు ఎప్పుడో చిన్న వయస్సులో ఉన్న ఫొటోతో ఆధార్ కార్డులతో ఇప్పుడు పోషణ ట్రాకర్ యాప్‌లో చేసుకునేందుకు అవకాశం లేదు. దీంతో ఆధార్ అప్‌డేట్ చేయాల్సి ఉంది. గతంలో ఇచ్చిన ఫోన్లు సహకరించకపోవడంతో సొంత ఫోన్లలో సిమ్‌లు వేసుకుని పనిచేయాల్సి వస్తుంది. ప్రతి నెలా కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన మిల్క్ యాప్, రాష్ట్ర ప్రభుత్వం మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కోసం ఉన్న యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఏఎన్‌ఎంలు చేసే మాతృవందన పథకానికి సంబంధించిన యాప్ త్వరలో అంగన్‌వాడీలకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఉన్న యాప్‌లతో అవస్థలు పడుతుంటే మరో యాప్‌ను అప్పగించడంపై అంగన్‌వాడీలు ఆపసోపాలు పడుతున్నారు.
బోధన తగ్గి.. పనిభారం పెరిగి..
ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆయా కేంద్రాలలో 15 వరకు రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం, పిల్లలకు, బాలింతలకు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతిరోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్–ఎ రికార్డు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శన రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్‌హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర రికార్డులు నమోదు చేయాల్సి ఉంది. దీంతో పిల్లలకు ప్రీస్కూల్ బోధన అటకెక్కుతుంది.
యాప్‌ల భారం తమపై మోపవద్దంటూ సీపీడీఓకు వినతిపత్రం అందిస్తున్న అంగన్‌వాడీలు
ఇచ్చేది గోరంత.. పని కొండంత
అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చే జీతం కంటే పనిభారం అధికంగా ఉంది. మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.7 వేలు, ఆయాలకు రూ.7 వేలు గౌరవవేతనం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు పోషకాహారం సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన యాప్‌లతో విసిగిపోతున్నారు. యాప్‌ల భారం తమపై మోపవద్దంటూ ఇప్పటికే పలుమార్లు నిరసనలు చేశారు. యాప్‌ల భారం తమపై వేయవద్దంటూ వేటపాలెం ప్రాజెక్టు సీడీపీఓ ఝాన్సీకి వినతిపత్రం అందించారు. ప్రాజెక్టు పరిఽధిలో 270 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 150 మంది అంగన్‌వాడీలు పనిచేయని ఫోన్లు తమకు వద్దంటూ సోమవారం ఐసీడీఎస్ కార్యాలయాలకు అప్పగించారు.
డేటా నమోదు చేయలేక అవస్థలు పడుతున్నాం..
కేంద్రాల నిర్వహణకు ప్రవేశపెట్టిన యాప్‌లు మోరాయించడం, సర్వర్లు పనిచేయకపోవడంతో నిత్యం ఫోన్లతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో ఒత్తిడికి లోనవుతున్నాం. తక్కువ వేతనం ఇస్తూ పలు రకాల యాప్‌లతో తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు కేంద్రాల నిర్వహణకు గతంలో ఇచ్చిన ఫోన్లును ప్రాజెక్టు కార్యాలయాలలో అప్పగిస్తున్నాం.
– ఎలిజిబెత్ రేఖా, జిల్లా కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
పనికంటే యాప్‌లో నమోదే ఎక్కువ పనిచేయని సర్వర్లు యాప్‌లతో సతమతమవుతున్న అంగన్‌వాడీలు యాప్‌ల భారం మోయలేమంటూ ఫోన్లు అప్పగింత