
వైన్ షాప్ సమీపంలో మృతదేహం
మార్టూరు: మండలంలోని ద్రోణాదుల గ్రామంలోని వైన్స్ షాప్ సమీపంలో సోమవారం ఉదయం ఒక పురుషుని మృతదేహం గుర్తించారు. అందిన వివరాల మేరకు.. ద్రోణాదుల నుంచి బొబ్బేపల్లి వెళ్లే మార్గంలో ఉన్న నేల చట్ట పక్కన ముళ్ల పొదలలో పురుషుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో మృతుడు ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన మురికిపూడి విజయ్ (65)గా గుర్తించి మృతదేహాన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు విజయ్ రెండు రోజులుగా స్థానిక వైన్స్ షాప్ సమీపంలో మద్యం తాగుతూ అక్కడే సంచరిస్తున్నట్లు విపరీతమైన దాహార్తితో కానీ గుండె నొప్పితో కానీ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తిమృతి
చీరాల రూరల్: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చీరాల–స్టూవర్టుపురం రైల్వేస్టేషన్ల మధ్యగల ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్ కాలువ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్ కాలువ సమీపంలో ఉదయం ఏడు గంటల సమయంలో రైలుబండిని గమనించకుండా రైలు పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని రైలుబండి ఢీట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని వయస్సు 28 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గూడ్స్ రైలు ఢీకొని వృద్ధుడి మృతి
నరసరావుపేట టౌన్: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఇన్‌చార్జి రైల్వే ఎస్‌ఐ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. నరసరావుపేట నుంచి మునుమాక వెళ్లే రైలు మార్గంలో ఆదివారం గుంటూరుకు చెందిన పెండెం సాయిబాబు(65) పట్టాలు దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన గూడ్స్ రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం బంధువులకు అప్పగించారు.

వైన్ షాప్ సమీపంలో మృతదేహం