కలెక్టర్‌ ఆదేశించినా పెన్షన్‌ ఇవ్వని అధికారులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఆదేశించినా పెన్షన్‌ ఇవ్వని అధికారులు

Aug 5 2025 6:33 AM | Updated on Aug 5 2025 6:33 AM

కలెక్టర్‌ ఆదేశించినా పెన్షన్‌ ఇవ్వని అధికారులు

కలెక్టర్‌ ఆదేశించినా పెన్షన్‌ ఇవ్వని అధికారులు

మార్టూరు: సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా బాధితులకు పెన్షన్‌ ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్న ఇద్దరు అధికారుల వైనం మార్టూరు మండలం కోనంకి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల వివరాల మేరకు.. మండలంలోని కోనంకి గ్రామం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి స్వగ్రామం. ఈ గ్రామంలో గత ప్రభుత్వ హయాం నుంచి 27 మంది డప్పు, చర్మ కళాకారులుగా పెన్షన్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి అమరయ్య అనే ఇద్దరు వ్యక్తులకు పంచాయతీ కార్యదర్శి నక్క సుధాకర్‌ ఈనెల మూడో తేదీ వరకు పెన్షన్‌ ఇవ్వలేదు. మార్టూరు ఎంపీడీవో వై శ్రీనివాసరావుకు బాధితులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో నాలుగో తేదీ సోమవారం బాధితులు జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళికి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌..

బాధితుల ద్వారా వివరాలు తెలుసుకున్న కలెక్టర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి 27 మందికి పెన్షన్‌ రాగా ఇద్దరికీ ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజే వారికి వచ్చిన పెన్షన్‌ అందజేయాలని ఎంపీడీవోని ఆదేశించగా బాపట్ల నుంచి మార్టూరు వచ్చిన బాధితులు ఎంపీడీవోని కలిశారు. కోనంకి పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌కు ఫోన్‌ చేసిన ఎంపీడీవో ఇద్దరికీ పెన్షన్‌ ఇవ్వాలని చెప్పి పంపించారు. పెన్షన్‌ కోసం పంచాయతీ కార్యాలయానికి వచ్చిన అచ్చయ్య, అమరయ్యలను సుధాకర్‌ సుమారు రెండు గంటల పాటు కూర్చోబెట్టి పెన్షన్‌ ఇవ్వకుండానే పంపించి వేశారు. పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ ఏమంటున్నాడంటే.. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ను విలేకరులు వివరణ కోరగా అచ్చయ్య, అమరయ్యలు ఇద్దరు సంబంధిత వృత్తి చేయడం లేదని సోమవారం కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారని, అందుకని పెన్షన్‌ ఇవ్వలేదన్నారు. ఫిర్యాదు ఎవరు చేశారో చెప్పలేకపోయిన సుధాకర్‌ మొత్తం 27 మందిపై ఫిర్యాదు చేశారని.. దర్యాప్తు చేసి నిర్ధారించుకున్నాకే పెన్షన్‌ ఇస్తానని, అందుకు ఎంపీడీవో కూడా ఇవ్వవద్దని అన్నట్లుగా చెప్పారు.

మీరుమీరు చూసుకోండన్న ఎంపీడీవో..

ఇదే విషయాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావును వివరణ కోరగా కాన్ఫరెన్స్‌ కాల్‌లో సెక్రటరీ సుధాకర్‌తో మాట్లాడారు. పెన్షన్‌ ఇవ్వవద్దని నేను అనలేదు కదా.. వచ్చిన పెన్షన్‌ ఇచ్చి తరువాత విచారణ ఉంటే చేసుకోమని చెప్పాను కదా అంటూ ఎంపీడీడీవో బదులిచ్చాడు. ఆ తర్వాత ఎంపీడీవో సుధాకర్‌ మీడియా ప్రతినిధులు ఇద్దరినీ ఉద్దేశించి మీరుమీరు చూసుకోండి అని చెప్పడం గమనార్హం. జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా కింది అధికారులు పెన్షన్‌ ఇవ్వకపోవడం ఏంటని, 27 మందిపై ఫిర్యాదు ఉంటే అందరికీ పెన్షన్‌ ఆపి దర్యాప్తు చేయాలి కానీ 25 మందికి పెన్షన్‌ ఇచ్చి ఇద్దరికీ ఆపటం ఏంటని బాధితులు అచ్చయ్య అమరయ్య వాపోతున్నారు.

ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల దోబూచులాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement