
దమ్మనవారిపాలెంలో భారీ చోరీ
కర్లపాలెం: దమ్మనవారిపాలెంలో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం ఎస్‌ఐ జి.రవీంద్ర తెలిపిన వివరాల మేరకు కర్లపాలెం మండలంలోని దమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన పిట్ల పెద వెంకటరెడ్డి కుటుంబంతో ఈనెల 17వ తేదీన పాండిచ్చేరిలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్ళాడు. ఈనెల 20వ తేదీన పెద వెంకటరెడ్డి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉండటంతో గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 21వ తేదీన వెంకటరెడ్డి స్వగ్రామానికి వచ్చి ఇంటిని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. బీరువా లాకరులో ఉన్న 141 గ్రాముల బంగారం, అరకిలో వెండి, రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాపట్ల రూరల్ సీఐ హరిబాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని క్లూస్ టీమ్స్ పిలిపించి వేలిముద్రలు సేకరిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.