దేశస్థాయిలో రేనాటి ఖ్యాతి

Pendekanti And BV Subbareddy Held Many Important Positions In Their Lifetime - Sakshi

రెండు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన పెండేకంటి

రాష్ట్ర, దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన బీవీ

కోవెలకుంట్ల(కర్నూలు): కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ఇద్దరు నేతలు రేనాటి ఖ్యాతిని రాష్ట్ర, దేశస్థాయిలో చాటారు. సంజామలకు చెందిన దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య ఏడు పర్యాయాలు ఎంపీగా, కర్నాటక, బీహార్‌ రాష్ట్రాల గవర్నర్‌గా, కేంద్రహోం సహాయశాఖ మంత్రి దేశానికి సేవలందించారు. కోవెలకుంట్లకు చెందిన దివంగత బీవీ సుబ్బారెడ్డి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలరించారు.

సంజామలకు చెందిన దివంగత  పెండేకంటి వెంకటసుబ్బయ్య 1921 సంవత్సరం జూన్‌16వ తేదీన జన్మించాడు. 1942వ సంవత్సరంలో సంజామల సర్పంచ్‌గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1957నుంచి 1984 సంవత్సరాల మధ్యకాలంలో ఏడు పర్యాయాలు నంద్యాల ఎంపీగా  ఎన్నికయ్యారు. కేంద్రహోం సహాయక మంత్రిగా,  1984 నుంచి 1986వరకు బీహార్‌ రాష్ట్ర గవర్నర్‌గా, 1987నుంచి 1990 వరకు కర్నాటక గవర్నర్‌గా పనిచేశారు. 

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన బీవీ
కోవెలకుంట్లకు చెందిన  మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత బీవీ సుబ్బారెడ్డి 1903 జులై 4వ తేదీన జన్మించారు.  లా కోర్సుచేసిన బీవీ  స్వాతంత్య్ర సమరోద్యమమంలో సత్యగ్రహం,  క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని దాదాపు మూడున్నర సంవత్సరాలపాటు తీహార్‌ జైలులో శిక్ష అనుభవించారు.

1955లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోదిగి ఎమ్మెల్యేగా, అనంతరం 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హ్యాట్రిక్‌ సాధించటమేకాక ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1962వ సంవత్సరం నుంచి  1970 వరకు  స్పీకర్‌గా పనిచేశారు. అనంతరం  1971వ సంవత్సరంలో ఉప ముఖ్యమంత్రిగా  రాష్ట్రానికి సేవలందించారు.1974 జూన్‌ 7వ తేదీన మృతి చెందారు. విద్యుత్, రోడ్ల నిర్మాణాలకు ప్రముఖ ప్రాముఖ్యత ఇచ్చి  కోవెలకుంట్ల ఖ్యాతిని రాష్ట్రం, దేశస్థాయిలో చాటారు.
 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top