రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్‌ ఓ వరం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్‌ ఓ వరం

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం

గోల్డెన్‌ అవర్‌లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ

సహాయం చేసిన వారికి రూ.25 వేల నగదు బహుమతి

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ వెల్లడి

మదనపల్లె టౌన్‌ : రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పీఎం రాహత్‌’ పథకం ఒక వరమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ పేర్కొన్నారు. బుధవారం మదనపల్లె పోలీసు కార్యాలయంలో పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ఈ ’నగదు రహిత చికిత్స’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గోల్డెన్‌ అవర్‌.. ప్రాణాలకు ఆధారం!

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్‌ అవర్‌) అత్యంత కీలకమైనదిగా ఎస్పీ అభివర్ణించారు. ఆ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ’ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా 112 నంబర్‌కు ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. బాధితులను వెంటనే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స ప్రారంభించవచ్చని ఎస్పీ తెలిపారు.

పథకం విశేషాలు ఇలా ఉన్నాయి..

ఉచిత చికిత్స : ప్రమాదానికి గురైన వ్యక్తికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తారని తెలిపారు.

ఏడు రోజుల పరిమితి: ప్రమాదం జరిగిన రోజు నుండి వరుసగా 7రోజుల పాటు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందవచ్చని తెలిపారు.

ఎవరెవరు అర్హులు అంటే..

రోడ్డుపై నడిచే పాదచారులు, సైకిల్‌ దారులు, ద్విచక్ర వాహనదారులు, డ్రైవర్లు విదేశీయులు సైతం ఈ పథకానికి అర్హులేనని చెప్పారు.

నిబంధనలు ఇలా..

ప్రమాదం జరిగిన అనంతరం వీలైనంత త్వరగా, సాధారణంగా 24గంటలలోపు బాధితుడిని ఆసుపత్రి లో చేర్చించితే ఈ పథకం ప్రయోజనాలను సంపూర్ణంగా పొందే అవకాశం ఉంటుందన్నారు.

సహాయం చేసేవారికి ’రక్ష’.. నగదు బహుమతి

ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే ’గుడ్‌ సమారిటన్‌ (రహవీర్‌)’లకు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులను కాపాడిన వారికి పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, పైగా వారి సాహసాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం రూ.25,000 వరకు నగదు బహుమతిని అందజేస్తుందని ఎస్పీ వెల్లడించారు. పోలీసు శాఖకు సమాచారం అందిన 24 గంటల్లోనే ప్రమాద ధృవీకరణ ప్రక్రియ పూర్తిచేసి, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసు కుంటామని తెలిపారు.

జిల్లా ఎస్పీ ఏమని విజ్ఞప్తిచేసారంటే..

’మీరు వేసే ఒక్క అడుగు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందని భయపడకండి. మానవత్వంతో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించి పీఎంరాహత్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి’ అని జిల్లా ఎస్పీ ధీరజ్‌ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement