సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌కు వాస్తు దోషమంటా.. | - | Sakshi
Sakshi News home page

సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌కు వాస్తు దోషమంటా..

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

ప్రధాన ద్వారం గేటు మార్చాలని

ఎస్‌ఐ హుకుం జారీ

అవాక్కవుతున్న సిమెంట్‌ కంపెనీల డీలర్లు, బ్రిక్స్‌ యజమానులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జిల్లాలోని సింహాద్రిపురంలోని పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషమని ప్రధాన ద్వారానికి తాళం వేసి మరొక గుమ్మం ద్వారా పోలీసులు నడుస్తున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ మెయిన్‌ ద్వారానికి తాళం వేయడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఇదేమిటని పోలీసులను ప్రశ్నించడంతో స్టేషన్‌కు వాస్తు దోషం పట్టిందని చెబుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషంవల్ల అనర్థాలు జరుగుతున్నాయని జ్యోతిష్యుడు చెప్పారని పోలీసులు తెలిపారు. బయట ఉన్న ఇనుప గేటును మార్చాలని జ్యోతిష్యుడు చెప్పడంతో గత నెల 21న పోలీసులు ఈ చర్య చేపట్టారు. 2023లో రూ. కోటి వ్యయంతో అన్ని హంగులతో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించారు. అప్పటినుంచి ఎందరో పోలీసులు, ఎస్‌ఐలు వచ్చి ఉద్యోగాలు చక్కగా చేశారు. అలాగే కొందరు ఎస్‌ఐలు సీఐలుగా పదోన్నతి కూడా పొందారు. కానీ 2026 ఫిబ్రవరిలో లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, సీఐలు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విధితమే. లంచం తీసుకుంటూ పట్టుబడినా కూడా వాస్తు దోషమని చెప్పడం ఎంతవరకు సమంజసమో వారికే అర్థమవ్వాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఉన్న ప్రధాన ద్వారాలకు తాళం వేసి వేరే ద్వారం గుండా నడుస్తుండడం, ప్రధాన గేటును కూడా మూసివేసి ఇంకో భాగానికి మార్చాలనుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడినా కూడా దీనికి పోలీసులు వాస్తు దోషం అనడంపై విస్మయం చెందుతున్నారు. అయినా ఎస్‌ఐ ఇవేమీ పట్టించుకోకుండా గత మంగళవారం ఐదు కంపెనీల సిమెంట్‌ డీలర్లను, ఇద్దరు బ్రిక్స్‌ యజమానులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి సిమెంట్‌, ఇటుకలు ఉచితంగా పోలీస్‌స్టేషన్‌కు అందించాలని హుకుం జారీ చేశారు. ఎస్‌ఐ సడన్‌గా వారితో ఈ మాట అనడంతో డీలర్లు ఆయనకు ఏమి చెప్పాలో అర్థంకాక మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement