మదనపల్లె టౌన్ : టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుంగునూరు మండలం అడవినాధుని కుంటకు చెందిన రైతు చెన్నారెడ్డి కొడుకు రవీంద్రనాథ్ రెడ్డి(51), సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లి కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బైకులో వెళుతుండగా మార్గమధ్యలోని పుంగనూరు రోడ్డు నయారా పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ ఢీ కొట్టి రైతు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఇరువర్గాల ఘర్షణలో
ఐదుగురికి గాయాలు
మదనపల్లె టౌన్ : ఇరు వర్గాల ఘర్షణలో ఐదుగురు గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ములకల చెరువుకు చెందిన నవీన్, జితేంద్ర బన్నీ మరికొంతమంది కలిసి ఓ మద్యం షాపు వద్దకు వెళ్లి ఫుల్‌గా మద్యం తాగినట్లు తెలిపారు. అందరూ స్నేహితులైనప్పటికీ మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో నవీన్ జరిపిన దాడిలో జితేంద్ర, బన్నీ మరో ఇద్దరు గాయపడగా, జితేంద్ర బన్నీలు జరిపిన దాడిలో నవీన్ సైతం గాయపడ్డాడు. గాయపడ్డ వారిని కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్ తెలిపారు.
కణితిపై కుక్కల దాడి
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం కుక్కల దాడిలో వన్యప్రాణి కణితి తీవ్రంగా గాయపడింది. ఫారెస్ట్ అధికారుల వివరాల మేరకు..ఒంటిమిట్ట చెరువులోని నీరు తాగేందుకు సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చిన కణితిని 7 కుక్కలు వెంటాడి తీవ్రంగా గాయపరిచాయి. ఆ కణితిని ఫారెస్ట్ సిబ్బంది పశువైద్య శాలకు తరలించి చికిత్స అందించారు.


