● పేట్రేగిన అవినీతి, అరాచకం
● ‘మావిగన్’పై సర్వత్రా చర్చ
● వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రమేష్‌కుమార్‌రెడ్డి
రాయచోటి : ఆంధ్రప్రదేశ్‌లో అభినవ ధృతరాష్ట్ర పాలన సాగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, హిందూపురం పార్లమెంటరీ పరిశీలకులు ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం రాయచోటిలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండు సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలిన కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విష ప్రచారం చేయడం, విధ్వంస పాలనతో రాష్ట్రంలో అరాచక పాలనను కొనసాగించడం వారి వంతైందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేయడంతోపాటు చట్టాన్ని సైతం వారి కనుసన్నల్లో నడిచేలా చేశారన్నారు. రాజకీయాలలో తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు కళ్లెదుట ఇంత అవినీతి, అరాచకం, విధ్వంస పాలన సాగుతున్నా అభినవ ధృతరాష్ట్రునిలా నటించడం ఆయనకే సాధ్యమైందన్నారు. సీఎం చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సభలు, సమావేశాలు పెట్టి చేయని అభివృద్ధిని సైతం తానే చేశానని ప్రచారం చేసుకోవడం, వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడం తప్ప సాధించిన ప్రగతి ఏమీ లేదన్నారు. అమరావతిని ఎవరూ కాదనలేదని రమేష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికితోడు తనకున్న పత్రికల ద్వారా నీచాతి నీచంగా మహిళలను సైతం కించపరుస్తూ కథనాలు రాయించడం సిగ్గుచేటన్నారు. ఒక విధంగా పత్రికలు కూటమి ప్రభుత్వం పట్ల ఓనర్‌షిప్‌ను చాటుకుంటున్నాయని విమర్శించారు.
‘మావిగన్’తో ఎంతో మేలు
అమరావతి కూడా పరిపాలన రాజధానిగా పెట్టాలన్న ఆలోచన వైఎస్‌ఆర్‌సీీపీకి ఉందన్నారు. రాజధానిని వెయ్యి లేదా రెండు వేల ఎకరాలలో బ్రహ్మాండంగా నిర్మాణాలు కట్టొచ్చని వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దెబ్బతగలకుండా మాజీ సీఎం జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన ప్రస్తావనను బయటకు తెచ్చారన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతాలను కలిపి అభివృద్ధి చేయడం ద్వారా రెవెన్యూ కూడా వస్తుందని జగన్ ప్రతిపాదంచారన్నారు. మావిగన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతోపాటు మేధావులు, విద్యావంతులు, వ్యాపారులు స్వాగతిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎన్‌టీఆర్, కృష్ణ, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, పరిపాలన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసినట్లు అవుతుందని గతంలో ప్రకటించారన్నారు.
అమరావతి పేరుతో దోపిడీ
ఈ రోజు రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను వదిలి ఒక అమరావతి పైన వేల కోట్ల రూపాయలు వెచ్చించి కమీషన్ల కోసం నిర్మాణం చేస్తున్నారన్నారు. ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల ఖర్చుతో అయ్యే పనికి 12 నుంచి 14000 ఖర్చు చేయడం ఇంతకంటే దోపిడీ ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. కన్‌స్ట్రక్షన్ కోసం అంత డబ్బులు పెట్టడమే కాక వాటి కోసం విద్యుత్, రోడ్లకు జీఎస్టీలో మినహాయింపు ఇవ్వడం వారి దోపిడీకి తార్కాణమన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు నేడు వారి మందిమాగాదులకు మేలు చేకూరేలా ప్రభుత్వ నిధులను ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీని అంకెలతో సహా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు వివరించడంతో కూటమి పాలకులలో ఆందోళనలు మొదలయ్యాయన్నారు. బెల్టు షాపుల ఏర్పాటు, ఇంటింటికీ లిక్కర్ బాటిల్ డెలివరీ, గంజాయి విక్రయాలు, అందిన కాడికి ఇసుక, మట్టి, గ్రానైట్‌ను దోచుకునే వాటిల్లో చంద్రబాబు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు.


