గుర్రంకొండ: ఒకప్పుడు దొంగల బారి నుండి టమాటాలను కాపాడుకొనేందుకు రైతులు రాత్రిళ్లు పొలాల వద్దనే జాగారం చేసేవాళ్లు. కష్టాలుపడి తోటల వద్ద నుంచి మార్కెట్‌కు తరలించేవారు. నేడు మార్కెట్లో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని రైతులు కాయలు కోయకుండా తోటల్లో వదిలేస్తున్నారు. మరికొంతమంది అతి తక్కువ ధరలకు జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు. మార్కెట్‌కు తరలిస్తే కమీషన్లు, రవాణా చార్జీల భారానికి భయపడి మార్కెట్‌యార్డు పరిసరాల్లో రోడ్లపైనే క్రీట్లు దించేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరికి తరలించేవారు వాటిని రోడ్లపైనే రాత్రింబవళ్లు ఉంచేసి తరువాత తీరుబడిగా తీసుకెళుతున్నారు. ఒకప్పుడు దొంగలు రాత్రిళ్లు తోటల వద్దకు వెళ్లి టమాటాలను ఎత్తుకెళ్లగా.. నేడు రోడ్లపైనే రాత్రింబవళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసినా తీసుకెళ్లే వారు కరువయ్యారు.
రోడ్లపైనే క్రీట్లు
టమాటా ధరలు పతనమవడంతో టమాటాలను క్రీట్లలో నింపి వ్యాపారులు రోజుల తరబడి రోడ్లపైనే ఏక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అయితే కళ్లుముందు టమాటాలు కనిపిస్తున్నా వాటిని ఎవరూ తాకడం లేదు. మండలకేంద్రంలో మార్కెట్‌యార్డుకు నాలుగు మండలాలకు చెందిన రైతులు టమాటాలను తీసుకొస్తుంటారు. ఆయా మండలాల పరిధిలో 2140 ఎకరాల్లో ఇప్పటికే పంట సాగు చేశారు. దిగుబడులు పుష్కలంగా వస్తున్నాయి. అయితే మార్కెట్లో ధరలు అశించినంతగా లేక పోవడం గమనార్హం ప్రస్తుతం 25కేజీల టామాటా క్రీట్ ఽ(బాక్సు) ధర రూ. 150 నుంచి రూ. 180 లోపే పలుకుతోంది. దీంతో రైతులకు పంటసాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి రాకపోగా మార్కెట్‌కు తరలించే ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పలువురు రైతులు జ్యూస్‌ఫ్యాక్టరీలకు తరలించే వ్యాపారులకు తోటల వద్దనే కాయలు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సరాసరి 25కేజీల క్రీట్ రూ. 70 నుంచి రూ.80కు టమాటాలను కొనుగోలు చేసి తోటల వద్దనే లోడింగ్ చేసి అక్కడి నుంచి వాహనాల్లో జ్యూస్‌ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు.
గతంలో తోటలవద్ద కాపాలా:
గతంలో టమాటా ధరలు ఆకాశానంటున్న తరుణంలో దొంగల బారి నుంచి కాయలను కాపాడుకొనేందకు రైతులు రాత్రిళ్లు తోటల వద్దనే కాపాలాగా పడుకొనేవారు. గతంలో క్రీట్ ధర రూ.2500 నుంచి రూ. 3500 వరకు ధరలు పలికాయి. మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కాలమంతా రైతులు కష్టాలు పడి కాయల్ని తోటల వద్ద కాపాడుకొన్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా నేడు రోడ్లపైనే వదిలేస్తున్నా దొంగలు కాదుకదా కనీసం సాధారణ ప్రజల కూడా వాటవైపు కన్నెత్తిచూడడం లేదు. టమాటా రైతుల దుస్థితికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ధరల పతనంతో రహదారి పక్కనే
వదిలేస్తున్న రైతులు


