న్యాయవాది హత్యకు పాతకక్షలే కారణం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాది హత్యకు పాతకక్షలే కారణం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

ఐదుగురు నిందితులు అరెస్టు

పరారీలో మరొకరు..

ట్రాక్టర్లు, బైకులు స్వాధీనం

జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

రాయచోటి : న్యాయవాది హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. గ్రామంలో ఆధిపత్యపోరు, పాత కక్షల కారణంగా పథకం ప్రకారం న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. గురువారం రాయచోటిలోని పాస్‌పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. కేవీపల్లె మండలం, పాత వడ్డిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పి ఎల్లయ్యకు అదే గ్రామానికి చెందిన నిందితులకు మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోందన్నారు. ఎల్లయ్య తన హోదానుఅడ్డుపెట్టుకొని తమను తక్కువచేసి చూస్తున్నాడని, పాత కేసుల ప్రస్తావన తెస్తూ గ్రామస్తులు ముందు అవమానిస్తున్నాడని నిందితులు కక్షపెంచుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈనెల 6వ తేదిన ఎల్లయ్య ఇంటిముందు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసిందన్నారు.

పథకం ప్రకారం దాడి...

హత్యచేయాలనే ఉద్దేశంతో నిందితులు కడప–పీలేరు రహదారిలోని మఠంపల్లి క్రాస్‌ వద్ద సమావేశమై స్కెచ్‌ వేశారని ఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం ఎల్లయ్య ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి దిగ్భంధనం చేసినట్లు వివరించారు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిపై దాడి చేసి అడ్డువచ్చిన ఎల్లయ్యను, తల్లిదండ్రులను బయటకు లాగి కొట్టారన్నారు. అనంతరం ఎల్లయ్యను పట్టుకొని కదలకుండా చేతులు, కాళ్లు నొక్కిపెట్టి పెద్ద బండరాళ్లతో తలపై బలంగా మోది ప్రాణాలు తీసినట్లు ఎస్పీ వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యల్లయ్య తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

అరెస్టు వివరాలు...

రాయచోటి డిఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌ పర్యవేక్షణలో కలకడ సీఐ లక్ష్మన్న బృందం గురువారం ఉదయం గడి క్రాస్‌ బస్టాప్‌ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కుంచెపు శ్రీనివాసులు (39), కుంచెపు మోహన్‌ బాబు (27), కుంచెపు పురుషోత్తం (28), పూజారి శంకరయ్య (26), బండి శివ (35)లను అరెస్టు చేయగా మరో నిందితుడు కుంచెపు నాగేశ్వర్‌ పరారీలో ఉన్నట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన రెండు బండరాళ్లు, ఐదు కట్టెలు, రెండు బైక్‌లు, రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌, కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె ఎస్‌ఐ శివకుమార్‌, కలకడ ఎస్‌ఐ రామాంజనేయులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వ్యక్తిగత కక్షలతో దాడులకు పాల్పడే వారికి స్థానం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement