9 మందిపై వేధింపుల కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

9 మందిపై వేధింపుల కేసు నమోదు

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

కారు ఢీకొని.. సేఫ్టీవాల్‌ ఢీకొని ..

మదనపల్లె టౌన్‌: భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు ఆమె కుటుంబీకులు మరో ఎనిమిది మందిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదుచేశారు. ఇందుకు సంబంధించి తాలూకా సిఐ కళా వెంకరమణ గురువారం తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని మదనపల్లె కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లకు చెందిన ఫాతిమాను ఆమె భర్త అబ్దుల్‌ అబూ బకర్‌ అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి అబ్దు అబూబకర్‌ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బైక్‌ల ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌: రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, బోయకొండకు చెందిన కళ్యాణ్‌ (24) బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో సొంత పని మీద మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి అదేరోజు రాత్రి స్వగ్రామానికి బయలేదేరాడు. పుంగనూరు రోడ్డు, బసినికొండ ఆర్చి వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన మరో బైక్‌ కళ్యాణ్‌ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు బాధితుడికి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.

రొంపిచెర్ల: అనంతపురం–చైన్నె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డులో గురువారం కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ మధుసూధన్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల క్రాస్‌ రోడ్డులో రోడ్డు దాటుతున్న ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్న పీలేరు మండలం అరుమానిపల్లెకు చెందిన విశ్వనాఽథ్‌(45)ను పీలేరు నుంచి వేగంగా వచ్చిన కారు (ఏపీ03 ఎఎక్స్‌ 3375) ఢీకొంది. ఈ ప్రమాదంలో అతని తల, ఎడమ కాలుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎసై మధుసూధన్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారు పీలేరు చెందిన రూకేష్‌కు చెందినగా గుర్తించారు. క్షతగాత్రుడిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూధన్‌ తెలిపారు.

మదనపల్లె టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె నియోజక వర్గంలోని పెద్దతిప్పసముద్రానికి చెందిన రైతు బాబూలాల్‌ (60) అదే ఊరికి చెందిన నూర్‌ అహమ్మద్‌ తో కలసి తన బైకులో సొంత పనిమీద మదనపల్లెకు బయలు దేరారు. కురబలకోట మండలం, సర్కారుతోపు వద్దకు రాగానే బైకు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీవాల్‌ ను ఢీకొని ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి బాబులాల్‌ ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని రెఫర్‌ చేశారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement