పెద్దమండ్యం : ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం దొడ్డిలో ఉన్న గొర్రెలపై కుక్కలు దాడి చేయడంతో 3 గొర్రెలు, 8 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పెద్దమండ్యం గ్రామం చిన్నకురవపల్లెలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాలలోకి వెళితే.. గ్రామానికి చెందిన సాంబ గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఒక జత గొర్రెలు రూ.25 వేలు చొప్పున కొనుగోలు చేశాడు. రోజువారీగా గొర్రెలను మేపుకొని వచ్చి ఇంటికి సమీపంలోని రోడ్డు పక్కనే ఉన్న దొడ్డిలో తోలేవాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండడంతో గొర్రెలను దొడ్డిలో తోలి ఇంటికి వెళ్లాడు. అంతలోనే దొడ్డిలోకి కుక్కలు చొరబడ్డాయి. కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో 8 గొర్రె పిల్లలు, రెండు గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు, గొర్రెపిల్లలు కుక్కల దాడిలో మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


