నందలూరుపై ఎందుకీ వివక్ష!
● మొన్న కోచ్ ఫ్యాక్టరీ.. నేడు ట్రిప్‌షెడ్ తరలింపు
● తిరుచానూరులో ఏర్పాటుకు టెండర్లు
● బీజేపీ చేతిలో మరోసారి దగాపడ్డ
నందలూరు రైల్వేకేంద్రం
రాజంపేట : గుత్తి–రేణిగుంట డబుల్‌లైన్ మార్గంలోని నందలూరు రైల్వే కేంద్రంపై బీజేపీ ప్రభుత్వం వివక్ష వీడలేదన్న విమర్శలు కొనసాగుతున్నాయి. నందలూరు రైల్వేకేంద్రానికి మరోసారి అన్యాయం జరిగింది. మొన్న కోచ్ ఫ్యాక్టరీ తరలించుకెళ్లారు. నేడు ట్రిప్‌షెడ్ (ఏసీ లోకో)కు సంబంధించి తిరుచానూరులో ఏర్పాటుకు రైల్వేశాఖ మొగ్గు చూపింది. టెండర్లను కూడా పిలిచింది. రైల్వేపరిశ్రమ ఏర్పాటుకు నందలూరు అనుకూలమన్నా ఇక్కడ పెట్టడానికి రైల్వేశాఖ వెనుకంజ వేస్తూనే వస్తోంది.
లాలూ సభలో ప్రకటించారు..
ఒకప్పుడు రైల్వేమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ పార్లమెంట్‌లో నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో వ్యాగిన్ రిపేర్ వర్క్ షాపు, కోచ్ ఫ్యాక్టరీ, ట్రిప్ షెడ్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలు దశాబ్దాల క్రితమే తెరపైకి వచ్చాయి. అయితే వాటిని అమలు చేయడంలో నందలూరు వివక్షకు గురవుతోంది.
కొత్త ట్రిప్‌షెడ్‌కు టెండర్లు..
తిరుచానూరు రైల్వేస్టేషన్ పరిధిలో కొత్త ట్రిప్‌షెడ్ ఏర్పాటుకు భారతీయ రైల్వే టెండర్లను ఆహ్వానించింది. ట్రిప్‌షెడ్ నిర్మాణం కోసం రూ.7.803955.86 కోట్లు విలువగా టెండర్ల ప్రకటన జారీ చేశారు. భారత రాష్ట్రపతి తరుపున సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీరు(గుంతకల్) టెండర్ల నోటిఫికేషన్ జారీ చేశారు.
రైల్వేపరిశ్రమ ఏర్పాటుకు
అనుకూలమని నివేదికలున్నా..
రైల్వేపరిశ్రమకు అవసరమయ్యే 145 ఎకరాలు, వందలాది క్వార్టర్స్, ఎంతటి కరువొచ్చినా పుష్కలంగా నీటి వనరులతోపాటు రైల్వే కార్మికుల కుటుంబాల నివాసానికి అనుకూలమైన ప్రాంతంగా నందలూరుకు పేరుంది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతం. కాని పాకాలలో పెట్టడం కేవలం కూటమి సర్కారు కక్ష సాధింపే కారణమనే భావన జిల్లా వాసులలో వ్యక్తమవుతోంది.
యూపీఏ పాలనలో..
యూపీఏ ప్రభుత్వంలో నందలూరులో ప్రత్యామ్నాయ రైల్వే పరిశ్రమకు ఆనాటి కేంద్రం అంగీకరించింది. అప్పటి మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాజ్యసభలో ప్రకటించారు. నందలూరు రైల్వేకేంద్రంలో వ్యాగిన్ రిపేరు వర్క్‌షాప్ లేదా ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో వ్యాగిన్ రిపేరు వర్క్‌షాపు, కోచ్ రీహ్యాబిటేషన్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తారనే దిశగా ఆశలు చిగురించాయి.
కోట్ల వచ్చారు..తరలించుకెళ్లారు..
రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నందలూరు రైల్వేకేంద్రంలో ఏర్పాటు చేయాలనుకున్న వ్యాగిన్ రిపేర్ వర్క్‌షాప్‌ను తన ప్రాంతమైన కర్నూ లుకు తరలించుకుపోయారు. ఆ విధంగా యూపీఏ పాలనలో నందలూరుకు అన్యాయం జరిగింది.
మరోసారి దగా..
నందలూరు రైల్వే కేంద్రంలో రైల్వేపరిశ్రమను ఏర్పాటు చేయాలని, 250 క్వార్టర్సు ఉన్నాయని, 150 ఎకరాల స్ధలం ఉందని అనేకమార్లు రైల్వేమంత్రిత్వశాఖకు వినతులు వెళ్లాయి. క్యారేజి రిపేర్‌షాపు, ఎలక్ట్రికల్ ఇంజిన్ రిపేర్‌షెడ్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. అయితే ఇవేమీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండు దశాబ్దాల క్రితం బీజేపీ కేంద్రపెద్దలు నందలూరుకు వచ్చి అధికారంలోకి రాగానే రైల్వేపరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీజేపీ అగ్రనేత నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురా లు పురందేశ్వరితో పాటు దేశ, రాష్ట్ర స్ధాయి నేతలు నందలూరు లోకోషెడ్‌ను చూసి వెళ్లారు. మూడవసారి ముచ్చటగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో మరోసారి నందలూరు దగాపడింది.


