కష్టపడినా గుర్తింపు ఏదీ!
మదనపల్లె : తంబళ్లపల్లె, మదనపల్లె టీడీపీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం ఆ పార్టీ రహస్యంగా పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దనరెడ్డి, టీడీపీ జోన్–4 ఇన్‌చార్జి దీపక్‌రెడ్డి స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అధికారులతో ఇబ్బందులు, అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లుల వ్యవహారాలపై మంత్రి, పార్టీ విషయాలపై దీపక్‌రెడ్డి చర్చించారు. గతంలో అందరి సమక్షంలో అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల జరిగిన ఘటనల నేపథ్యంలో మంత్రి ఒక్కో నాయకునితో వ్యక్తిగతంగా సమావేశమై రహస్యంగా వివరాలు సేకరించారు. కొంతమంది ఎమ్మెల్యే షాజహాన్‌బాషా టీడీపీ సీనియర్లను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కూడా ఫిర్యాదు చేశారని పార్టీవర్గాలు తెలిపాయి. తాను ఎమ్మెల్యేగా ఉండగా పార్టీలో వర్గాలను పెంచిపోషిస్తూ ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్న వారిపై ఫిర్యాదు చేసి, ఇలాగైతే పాలన ఎలా సాగించాలని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై మండలాల నుంచి వచ్చిన నాయకులు దీపక్‌రెడ్డి ఎదుట ఫిర్యాదు చేసుకున్నారు. ఇన్‌చార్జిని నియమించాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుల పదవుల్లో తమకే ప్రాధాన్యత ఇవ్వాలని జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గం పట్టుపట్టారు. పార్టీకోసం కష్టపడిన తమను గుర్తించరా, కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తారా అని గట్టిగా నిలదీయడంతో ఉద్రికత్తకు దారితీస్తుందని భావించిన పోలీసులు తంబళ్లపల్లె టీడీపీ నేతలను కార్యాలయం నుంచి వెలుపలికి తీసుకొచ్చారు. తంబళ్లపల్లె పార్టీ పరిస్థితిపై త్రీమెన్ కమిటీ విచారణ జరిపిందని చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.
మంత్రి, ఇన్‌చార్జిలపై తంబళ్లపల్లె టీడీపీ నేతల ఆగ్రహం.. పోలీసుల జోక్యం


