మనోహరం.. ధనుర్మాసం.! | - | Sakshi
Sakshi News home page

మనోహరం.. ధనుర్మాసం.!

Dec 16 2025 4:49 AM | Updated on Dec 16 2025 4:49 AM

మనోహరం.. ధనుర్మాసం.!

మనోహరం.. ధనుర్మాసం.!

నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభం

మోగనున్న నెలగంట

నెలరోజుల పాటు పల్లె సీమల్లో

ఆధ్యాత్మిక సందడి

రాజంపేట టౌన్‌ : హిందువులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. నిరుపేదలు కూడా సంక్రాంతి పండుగను ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పల్లెసీమల్లో పెద్దపండుగ వాతావరణం కనిపిస్తుంది. తెలుగు సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే గ్రామీణ ప్రాంతాలు ముస్తాబవుతాయి. కాగా మంగళవారం సాయంత్రం 5–30 గంటలకు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈమాసం వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ మకర సంక్రాంతితో ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభం కావడాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు నెలగంట, పండుగ నెల అని పిలుస్తారు. ఈ నెల రోజులు ఇటు పట్టణ ప్రాంతాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస పూజలు నిర్వహించేందుకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిత్యం తిరుప్పావై పారాయణం..

విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. నిత్యం తిరుప్పావై పారాయణం చేస్తూ విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని అలాగే సంపద, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ముఖ్యమైనదని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతం సందర్భంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి ఐదు రోజులు నియమ నిబంధనలకు సంబంధించిన పాశురాలు, 6వ రోజు నుంచి 15వ రోజు వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి సందగోపుని గృహానికి వెళ్లడం. 16, 17, 18వ రోజుల్లో పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ రోజు పాశురంలో మంగళాశాసనం, 25, 26వ రోజుల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాలను ‘పర’ అనే వాయిద్యాన్ని తమ శరణాగతిని అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నేరవేర్చమని ప్రార్థిస్తారు. చివరి రోజు గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

విశిష్టమైన ఉత్తర ద్వార దర్శనం..

ఏడాదిలో 24 ఏకాదశులు ఉన్నప్పటికి ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి ఎంతో విశిష్టమైనది. వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా మహావిష్ణువుని దర్శించే అవకాశం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ముక్కోటి దేవతల ఆశీస్సులతో పాప విమోచనం, మోక్ష ప్రాప్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం.

సాంప్రదాయాలకు నెలవు..

ధనుర్మాసం సాంప్రదాయాలకు నెలవు అనే చెప్పాలి. ఈ మాసంలో ఇంటి ముంగిట మహిళలు వేసే రంగవల్లులు, పగటి వేషం వేసే కళాకారులు, డూ డూ బసవన్నల సందడి, సాంప్రదాయ పిండి వంటలతో పల్లెసీమలు కళకళలాడుతాయి. అలాగే ఉద్యో గ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు విధిగా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు చేరుకుంటారు. పరమపదించిన కుటుంబ స భ్యులకు దుస్తులు పెట్టుకొని పూజలు చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పండుగకు కొన్ని రోజుల ముందే మారుమూల ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతాయి. పోలీసులు కోడిపందేలను నిర్వహించకుండా ఎన్ని చర్యలు చేపట్టినా కొంత మంది కోడిపందేలు కాయడం అనాదిగా వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement