అక్రమార్కులకు అధికారుల అండ!
● రైతుల అనుమతి లేకుండా పొలాల్లో
వాటర్‌షెడ్ పనులు
● ఇదేమిటని ప్రశ్నించిన రైతులకు
టీడీపీ నాయకుల బెదిరింపులు
పెద్దతిప్పసముద్రం : ఇటు ప్రజలకు అటు రైతులకు ప్రయోజనకరమైన పనులు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్‌షెడ్‌కు రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాయి. మంజూరైన నిధులను ఎలాగైనా ఖర్చు పెట్టేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు గ్రామ స్థాయిలో ఉండే కూటమి నాయకులతో కుమ్మకై ్క నిబంధలను తుంగలో తొక్కి ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నా పట్టించుకునే నాథులే లేరని ప్రజలు విమర్శిస్తున్నారు. కూటమి నాయకులకు వాటర్‌షెడ్‌లో పని చేసే క్షేత్ర స్థాయి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో పనుల నిషేధం ఉన్నా చెరువులు, ఏరు, కుంటలతో పాటు, రైతుల వ్యవసాయ పొలాలు ఇలా ఎక్కడబడితే అక్కడ ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఉదాహరణకు మండలంలోని రంగసముద్రానికి చెందిన బుడ్డోల్ల చిన్న నాగప్ప పేరిట రెండు ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూమి ఉంది. నాలుగేళ్ల క్రితం రైతు మృతి చెందగా కుటుంబ సభ్యులు పంటలను సాగు చేసేవారు. జింకల బెడద అధికంగా ఉండటంతో ఈ ఏడాది చుట్టు పక్కల రైతులు ఎవరూ పంటలు సాగు చేయనందున రైతు చిన్న నాగప్ప కుటుంబీకులు కూడా భూమిని బీడుగా వదిలేశారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా రాపూరివాండ్లపల్లి పంచాయతీడి. నారాయణపల్లికి చెందిన ఓ గ్రామ స్థాయి టీడీపీ నాయకుడు ఐదు రోజుల క్రితం తమ పొలంలో అక్రమంగా ఫారంపాండ్ తవ్వేశాడని రైతు కుమారుడు నాగరాజు సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు.
దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరిస్తున్నాడు..
రంగసముద్రం పంచాయతీలోని వాటర్‌షెడ్‌లో నేను కూడా కమిటీ సభ్యుడిని. కూలి పనులే మాకు జీవనాధారం. మాకు చెప్పకుండా మా పొలంలో ఫాంరంపాండ్ పని ఎందుకు చేశావని ప్రశ్నిస్తే నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని కూటమి నాయకుడు బెదిరిస్తున్నాడు. అధికారులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశాను. వాళ్లు చొరవ చూపి గుంత పూడ్పిస్తారని అనుకుంటున్నాను.
– నాగరాజు. రంగసముద్రం


