ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం తగదు
రాయచోటి : ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు, ఇతర సమస్యలపై ఎస్పీ స్వయంగా విచారణ జరిపారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు.
అభివృద్ధి పథకాల్లో ప్రజల భాగస్వామ్యంతో సత్ఫలితాలు
కురబలకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యంతో సత్ఫలితాలు సాధ్యమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్యం విభాగ డైరెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. సోమవారం కురబలకోట మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆస్పీరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్య, వైద్య సేవల్లో నాణ్యత పాటించాలన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ పనుల అడ్డగింత
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆవరణలో టీటీడీ ప్రారంభించిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాట్లు స్థలానికి నష్టపరిహారం చెల్లించకుండా తమ స్థలంలో పనులు జరుగుతున్నాయని పామూరు వెంకట సుబ్రమణ్యం అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ స్థలంలో వారి హద్దు వరకు కంచెను ఏర్పాటు చేసేందుకు సోమవారం సిమెంట్ స్తంభాలు కూడా నాటించారు. తమకు నష్టపరిహారం చెల్లించాకే తమ స్థలంలో ఏ పనులైనా టీటీడీ అధికారులు చేపట్టాలని ఆయన కోరుతున్నారు.
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం తగదు


