బాలిక అదృశ్యం
నిమ్మనపల్లె : మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఽష్ణునారాయణ తెలిపారు. నిమ్మనపల్లె పంచాయతీకి చెందిన మైనర్ బాలిక (16) ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి బాలిక స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఏఎస్‌ఐ జిలానీబాషా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అతిగా మద్యం తాగి
వ్యక్తి మృతి
ములకలచెరువు : అతిగా మద్యం తాగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా అమడగూరు మండలం గుండాలవారిపల్లెకు చెందిన నరసింహులు(40) కుమారులు తిరుపతిలో చదువుకుంటున్నారు. పిల్లలని చూసొస్తానని చెప్పి వారం క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం తిరుపతి నుంచి వచ్చి ములకలచెరువులోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ తరచూ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం తాగి కదిరి రోడ్డు షాదీమహల్ వద్ద అపస్మారకస్థితిలో పడిపోయాడు. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వివాహిత..
పెద్దమండ్యం : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సోమవారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ ఇషాక్ తెలిపారు. మండలంలోని సీ గొల్లపల్లె పంచాయతీ బుసిరెడ్డిగారిపల్లెలో ఈ ఘటన జరిగింది. ఏఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శ్రీనాథరెడ్డికి గుర్రంకొండ మండలం ఎల్లుట్ల బురుజుపల్లెకు చెందిన సుజాత (32) తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనాథరెడ్డి మదనపల్లె మండలంలోని సీటీఎంలో ఓ వైన్‌షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి భార్య, బిడ్డలను చూసుకొని వెళ్లేవాడు. ఈ క్రమంలో భర్తపై భార్య సుజాత అనుమానం పెంచుకొంది. ఈ విషయమై సుజాత తనతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆమె కుమార్తెకు సర్ది చెప్పింది. ఆయితే ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
మద్యం మానేయమంటే..
చెరువులో దూకి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : ఇంట్లో పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. మద్యం మానేసి బాధ్యతగా ఉండాలని భార్య, భర్తను మందలిస్తే మనస్తాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన చెంగారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(44)కు భార్య రేణుక, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంట్లోనే సమోసాలు, మిక్చర్ తయారుచేసి విక్రయించడమే కాకుండా, స్థానికంగా ఉన్న షాపులకు వేస్తూ జీవిస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవిస్తున్న కారణంగా తరచూ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఈనెల 12న సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. దీంతో భార్య రేణుక మందలించింది. మనస్తాపం చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం స్థానికంగా ఉన్న నక్కలకుంట చెరువులో ఓ వ్యక్తి శవమై తేలడంతో గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారించారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మృతి చెందిన వ్యక్తి చంద్రశేఖర్‌రెడ్డి అని నిర్ధారించారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
వీఆర్‌ఏలపై దాడి ఘటనపై డీఎస్పీ విచారణ
గాలివీడు : విధి నిర్వహణలో ఉన్న వీఆర్‌ఏలపై ఉదయ్‌కుమార్ అనే యువకుడు దాడి చేసి, కులం పేరుతో దూషించాడన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయమై సోమవారం రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ విచారణ చేపట్టారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో బాధిత వీఆర్‌ఏలను విచారించారు. దాడి ఘటనలో ధ్వంసమైన ఫర్నిచర్‌తో పాటు చెల్లాచెదురైన ఫైళ్లను తహసీల్దార్ భాగ్యలతతో కలిసి డీఎస్పీ పరిశీలించారు. విచారణలో లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి, స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.
బాలిక అదృశ్యం


