వరదాయిని.. జగజ్జనని
పూజలు నిర్వహిస్తున్న మఠాధిపతి వీరశివకుమారస్వామి, గీతా పారాయణంచే స్తున్న చిన్మయామిషన్ వారు
బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవి మఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన సోమవారం పూర్వపు మఠాధిపతి వీరబ్రహ్మయ్యాచార్య స్వాముల వారి ఆరాధన నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవ, అభిషేషకం, బిల్వదళార్చన, గురుపూజ విధులు చేపట్టారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ద్వార పూజ, నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. బ్రహ్మంగారిమఠానికి చెందిన చిన్మయామిషన్ వారి గీతాపారాయణం భక్తులను అలరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత ఈశ్వరీదేవిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి, దాతలు తమిదల కోటిరెడ్డి, శిల్పా శ్రీకాంత్, కల్లూరు కేశవాచారి, కోడూరి సుబ్రహ్మణ్యాచారి, పోలు పోలేటమ్మగారి సుబ్బారెడ్డి, బాల హుస్సేన్‌రెడ్డి, యాకశిరి జయలక్షుమ్మ, నొస్సం సుబ్రహ్మణ్యాచారి, మహేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.
వరదాయిని.. జగజ్జనని


