నేత్రదానంతో ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగు
చింతకొమ్మదిన్నె : మండలంలోని నరసన్నగారిపల్లి గ్రామానికి చెందిన సందడి వీర ప్రతాప్‌రెడ్డి నేత్రదానం ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. వీరప్రతాప్‌రెడ్డి మృతితో ఆయన సతీమణి రత్నకుమారి, కుమారుడు జనార్దన్‌రెడ్డి, కోడలు రామసాయి అఖిల, కూతురు మీనాక్షి, అల్లుడు శివశంకర్ రెడ్డి, మనవరాలు వర్ణికలు నేత్రదానానికి అంగీకరించారు. ఈ మేరకు స్నేహా సేవాసమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, స్నేహిత అమృతహస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ ప్రశాంత్, ఎల్‌వీ ప్రసాద్ నేత్రాలయం మేనేజర్ రెడ్డిబాబు మృతుడి స్వగృహానికి వెళ్లి మృతుడి కార్నియాలను సేకరించి ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి పంపినట్లు రాజు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేయదలచుకున్న వారు ఫోన్ నంబర్లు :9966509364 లేదా 9885339306లకు సమాచారం ఇచ్చి అంధత్వంతో బాధ పడుతున్న అంధులకు చూపు ఇచ్చే బృహత్కార్యానికి ప్రతి కుటుంబం ముందుకు రావాలన్నారు.
మూగజీవాల తరలింపుపై కేసు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి నుంచి బయటి ప్రాంతాలకు మూగ జీవాలను తరలిస్తున్న వారిని పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథ్‌రెడ్డి అదివారం తెలిపారు. మైదుకూరు నుంచి అనంతపురం, పుంగనూరుకు మూగజీవాలను రెండు కంటైనర్లలో తరలిస్తుండుగా పట్టుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. వాటిలో ఎద్దులు, గేదెలు, దున్నపోతులు ఉన్నాయని, కానీ ఆవులు లేవన్నారు. సుమారు 82 జంతువులను తరలిస్తుండటంపై జంతు హింస నిరోధక చట్టం కింద నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
దాడి చేసిన వారిని శిక్షించాలి
అట్లూరు : అయ్యప్పస్వామి భక్తుడిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలని అయ్యప్ప భక్తులు పేర్కొన్నారు. అట్లూరు క్రాస్ రోడ్డు సమీపాన అయ్యప్పస్వామి ఆలయం వెనుక వైపున ఉన్న స్థల విషయమై నవంబర్ 25న అయ్యప్ప మాలధారణలో ఉన్న నరసింహారెడ్డిపై రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఆయన కుమారుడు శివ దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం అట్లూరు క్రాస్‌రోడ్డు కడప–బద్వేలు ప్రధాన రహదారిపై సుమారు 100 మంది అయ్యప్పస్వామి భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.


