అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు!
● 22 సార్లు పాదయాత్ర చేసిన ఆకేపాటి
● ఇప్పుడు కాలిబాటపై తెరపైకి నిషేధాజ్ఞలు
● నిషేధంపై వివరాలు వెల్లడించిన
డీఎఫ్‌ఓ, ఎస్పీ
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచి ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కాలిబాటపై ఆంక్షలను విధించారు. గత 22 ఏళ్లుగా ఎన్నడూ లేని రీతిలో ఈ సారి అటవీమార్గంలో వెళ్లకుండా నిషేధాజ్ఞలను తీసుకొచ్చారు. అటవీ మార్గంలోని కాలిబాటలో భక్తులు పయనించరాదని అటవీశాఖ తీసుకొచ్చిన ఆంక్షలు శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య కాలిబాటలో పయనించే అంశం వివాదాస్పదంగా మారింది.
22 సార్లు అన్నమయ్య కాలిబాటలో ఆకేపాటి పాదయాత్ర
ఇప్పటికే 22 సార్లు అన్నమయ్య కాలిబాటలో రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి తిరుమల మహాపాదయాత్ర చేపట్టారు. వేలాదిమంది శ్రీవారి భక్తులతో ఆకేపాడులో ఆలయాల సముదాయాల నుంచి కుక్కలదొడ్డి వరకు వెళ్లి అక్కడి నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలో అన్నమయ్య నడిచివెళ్లిన కాలిబాటలో శ్రీవారి సన్నిధికి చేరుకునేవారు..
23వ సారి..
23వ సారి తిరుమల మహాపాదయాత్రకు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈనెల 5న తిరుమల మహాపాదయాత్రను వేలాదిమంది భక్తులతో బయలుదేరే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఈ పాదయాత్రపై గత కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం కూడా చేశారు. అనేకమంది శ్రీవారిభక్తులు ఆకేపాటి వెంట కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించారు. ఇప్పుడు కాలిబాటలో పయనంపై ఆంక్షలను అటవీశాఖ తీసుకురావడంతో ఈ అంశం ఆధ్యాత్మిక ప్రియులు, భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది.
రోడ్డు మార్గంలోనే తిరుమలకు వెళ్లాలి..
జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథ్‌సింగ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలు బుధవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు పాదయాత్రపై నిషేధం విధించినట్లుగా వెల్లడించారు. ఎవరైనా తిరుమలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. చట్టాన్ని వ్యతిరేకించి లోపలికి వెళితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులకు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది తమ ఉద్దేశమన్నారు. అడవిలో ఏనుగులు, వాటి పిల్లలు, చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. వీటి వల్ల భక్తులకు ప్రాణాపాయం పొంచి ఉంటుందన్నారు. అడవిలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండాయన్నారు. వంకలు పొర్లుతున్నాయన్నారు. ఈ కారణాల దృష్ట్యా కాలిబాటలో తిరుమలకు వెళ్లే మార్గంలో నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.
అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు!
అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు!


