పేదల ఆపిల్ సీతాఫలం. అమృతంలా తియ్యగా ఉండే ఈ పండు అంటే అ
కేరళతోపాటు మూడు రాష్ట్రాలకు ఎగుమతి
మూడు నెలల పాటు జీవనోపాధి
రోజుకు రెండు బుట్టలు సేకరిస్తాం
● జిల్లాలో విస్తృతంగా దిగుబడి
● బయటి ప్రాంతాలకూ ఎగుమతి
● సిరులు కురిపిస్తున్న పంట
గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా నుంచి కేరళతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సీతాఫలాలు ఎగుమతి చేస్తున్నారు. వీటి సేకరణ ఎందరో కూలీలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఈ ఏడాది ముసురు వర్షాల కారణంగా ఈ పంట దిగుబడి 40 శాతానికి పడిపోయింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి.
వేలాది మంది కూలీలకు జీవనోపాధి
అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పడమటి ప్రాంతమైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది కూలీలకు సీతాఫలాల సేకరణ జీవనోపాధి కల్పిస్తోంది. ప్రతి నిత్యం కూలీలు సీతాఫలాలను మదనపల్లె, రాయచోటి, గుర్రంకొండ, కండ్రిగ లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో చాలా మంది వీటిని సేకరించి జీవనం సాగిస్తుంటారు. ఆయా గ్రామాల సమీపంలోని కొండలు, గుట్టల్లో రోజంతా గాలించి సీతాఫలాలను కూలీలు సేకరిస్తుంటారు. పలువురు కూలీలు బృందంగా ఏర్పడి రెండు రోజుల పాటు సేకరించి ఆటోలలో క్రీట్‌ల ద్వారా సీతాఫల మండీలకు తీసుకొస్తున్నారు. కాగా పలువురు వ్యాపారులు గ్రామాలకే వచ్చి కూలీల దగ్గర నేరుగా కొనుగోలు చేసి బయటి ప్రాంతాలకు తీసుకెళుతున్నారు.
దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు
ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడంతోపాటు ఇటీవల చాలా రోజులు కురిసిన ముసురు వర్షాలకు గత ఏడాదితో పోల్చితే.. 40 శాతం దిగుబడి కూడా చేతికందడం లేదని రైతులు అంటున్నారు. దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్‌లో సీతాఫలాల ధరలు అమాంతం పెరిగాయి. గతేడాదితో పోల్చితే రెండింతలు ధర పెరగడం గమనార్హం. గత ఏడాది 25 కేజీల క్రీట్ ధర మార్కెట్‌లో రూ.250 నుంచి 350 వరకు పలికాయి. ప్రస్తుతం క్రీట్ ధర రూ.600 నుంచి రూ.700 వరకు పలుకుతుండటం గమనార్హం. ప్రస్తు తం పండ్ల దుకాణాల్లో డిమాండ్‌ను బట్టి కిలో ధర రూ.100 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి.
రోజుకు రూ.1000 మేరకు ఆదాయం
సీతాఫలాల సేకరణతో కరువు కూలీలకు రోజుకు రూ.1000 మేరకు ఆదాయం సమకూరుతుంది. ఈ సీజన్‌లో కూలీలు రోజుకు కనీసం రెండు క్రీట్‌ల సీతాఫలాలు సేకరిస్తుంటారు. పల్లెల నుంచి వాటిని బుట్టలు, క్రీట్‌లలో తీసుకొచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండీలలో విక్రయిస్తుంటారు. రోజూ ఉదయమే పల్లెల నుంచి ఆటోలలో సీతాఫలాలు తీసుకొచ్చి పట్టణ ప్రాంతాలు, డాబాలు, ఎన్‌హెచ్ 340 రోడ్డు పక్కన పెట్టి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఒక్కో బుట్ట(క్రీట్) రూ.600 నుంచి రూ.700 విక్రయిస్తుంటారు. ఖర్చులు పోను సగటున ఒక్కో కూలీ రూ. 1000 మేరకు సంపాదించుకుంటారు.
ఉద్యానవన పంటగా..
పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇప్పుడిప్పుడే సీతాఫలాల తోటలు ఉద్యానవన పంటలుగా పెంచుతుండటం విశేషం. గతంలో సీతాఫలాలు కొండలు, గుట్టలు, గుర్రంకొండ కోట, ఎల్లుట్ల, కోటకొండ, తంబళ్లపల్లె, కోసువారిపల్లె వంటి అటవీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ విరిగిగా లభించేవి. పొలాల గట్లు, చేలగట్లుపైన కూడా ఈ చెట్లను రైతులు పెంచేవారు. ఇది కేవలం వర్షాధార పంటగా ఉండేది. ప్రస్తుతం పలువురు రైతులు మార్కెట్‌లో సీతాఫలాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఉద్యానవన తోటలుగా పెంచుకొంటున్నారు. కొన్ని గ్రామాల్లో వీటి తోటల పెంపకం చేపట్టారు. దీంతో వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వెళ్లి కొనుగోలు చేసి బయటి ప్రాంతాలకు ఎగుమతి చేసుకుంటున్నారు.
మన ఫలాలకు భలే డిమాండ్
బయటి రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, పట్టణాల్లో.. అన్నమయ్య జిల్లాలోని సీతాఫలాలకు భలే డిమాండ్ ఉంది. కూలీల దగ్గర కొనుగోలు చేసిన సీతాఫలాలను స్థానిక వ్యాపారస్తులు బయటి రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కనిగిరి, నెల్లూరు, ఉదయగిరి, దర్శి, మార్కాపురం, నరసరావుపేట వంటి పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. అక్కడి వ్యాపారులు కూడా గుర్రంకొండ వచ్చి కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై పెట్రోలు బంకులు, డాబాలు, చిల్లర దుకాణాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. రాత్రిళ్లు ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలిపి డాబాల్లో భోజనాలు చేస్తుంటారు. బెంగళూరు నుంచి కడప, ప్రొద్దుటూరు, కావలి, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, దర్శి, మార్కాపురం, చీరాల, పొదిలి, గిద్దలూరు, రాజంపేటతోపాటు మరిన్ని బస్సు సర్వీసులు రాత్రివేళల్లో ఇక్కడ నిలుపుతుంటారు. దీంతో ప్రయాణికులూ ఇక్కడి సీతాఫలాలను ఇష్టపడి మరీ తీసుకెళుతుంటారు.
గ్రేడ్‌ను బట్టి రేటు
కూలీల దగ్గర కొనుగోలు చేసిన సీతాఫలాలను మండీల వ్యాపారులు గ్రేడ్‌ల వారీగా విభజిస్తారు. ప్రతి క్రీట్, బుట్టలోని సీతాఫలాలను ఏ,బీ,సీ గ్రేడ్‌లుగా విభజించడం జరుగుతుంది. గ్రేడ్‌లను బట్టి వంద సీతాఫలాలను ఏ గ్రేడ్ రూ.1200, బి గ్రేడ్ రూ. 950, సీ గ్రేడ్ రూ.700 వరకు విక్రయిస్తుంటారు. బయటి రాష్ట్రాలకు మాత్రం ఏ,బీ గ్రేడ్ సీతాఫలాలనే ఎగుమతి చేస్తుంటారు.
జిల్లాలోన పలు పట్టణాలు, గ్రామాల నుంచి సీతాఫలాలు కేరళతోపాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. బయటి రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చి మండీలలో వ్యాపారుల దగ్గర సీతాఫలాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మండీలలో ఒక్కో క్రీట్ రూ.600 నుంచి రూ.700 వరకు చెల్లించి బయటి రాష్ట్రాల వ్యాపారులు తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ సీతాఫలాల పంట సరిగా లేక అధిక డిమాండ్ ఉండటం వల్ల.. ఒక్కో క్రీట్ రూ.1400 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతుండటం విశేషం.
సీతాఫలాల సేకరణతో మూడునెలల పాటు మాకు జీవనోపాధి లభిస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. పొలాల గట్లు, కొండలు, గుట్టల్లో గాలించి వీటిని సేకరణ చేస్తాం. ఒక రోజంతా సేకరణకే సమయం సరిపోతుంది. మరుసటి రోజు పట్టణాలు, గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం.
– లక్ష్మీదేవి, ఎగువబోయపల్లె, గుర్రంకొండ
ఈ సీజన్‌లో సగటున రోజుకు రెండు బుట్టల సీతాఫలాలు సేకరిస్తుంటాం. కాయల నాణ్యతను బట్టి ఒక బుట్ట కాయలు రూ.600 నుంచి రూ.700 వరకు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పోను రోజుకు రూ.1000 వరకు సంపాదిస్తుంటాం. కాకపోతే ఈ ఏడాది సీతాఫలాల సేకరణ చాలా కష్టంగా మారింది. కాయలు పెద్దగా కాయలేదు. సీజన్ తొందరగా ముగిసిపోనుంది.
– రామాంజులు, బురుజుపాళెం, గుర్రంకొండ
పేదల ఆపిల్ సీతాఫలం. అమృతంలా తియ్యగా ఉండే ఈ పండు అంటే అ
పేదల ఆపిల్ సీతాఫలం. అమృతంలా తియ్యగా ఉండే ఈ పండు అంటే అ


