● కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విన్నపం..
మదనపల్లె : ఏ ప్రభుత్వమైనా పేద విద్యార్థులకు నా ణ్యమైన విద్యనందించాలి.. మెరుగైన వసతులు కల్పించాలి.. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభానికి సహకరించండి, భూమి కేటాయించండి అని చెబుతున్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కుయుక్తులు పన్నుతూ కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి నోచుకోకుండా మోకాలడ్డుతోంది. దీంతో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విద్యావేత్తలు మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్షనేత, రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి తన నియోజకవర్గంలోని మదనపల్లెకు మంజూరు చేయించిన ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి నోచుకోకుండా అడ్డుపడుతోంది కూటమి ప్రభుత్వమే అని తెలుస్తోంది. ఈ కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యేలా చూడండి.. భూమి కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. అందుకు కూటమి ప్రభుత్వం సుముఖతగా లేనట్టు కనిపిస్తోంది. పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దాలన్న లక్ష్యంతో సాధించిన ఈ విద్యాలయం మదనపల్లెకు మకుటంగా నిలుస్తుంది. అయితే రాజకీయ కారణాలతో తరగతుల ప్రారంభానికి చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదు. భూ కేటాయింపునకు సంబంధించిన నివేదికలు ముందుకు కదలడం లేదు. ఫలితంగా తమకోసం సిద్ధం చేసిన భూమిని మాకు అప్పగించండి అంటూ కేంద్రీయ విద్యాలయం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు నవంబర్ నెలలో లేఖ రాసింది. దీనిపైనా కదలిక లేకపోవడంతో బుధవారం ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించి వినతిపత్రం అందజేశారు.
మేం సిద్ధం.. భూమి కేటాయించండి..
మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రా రంభించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రీయ విద్యాలయాల అదనపు కమిషనర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు నవంబర్ ఆరున పంపిన లేఖలో పేర్కొన్నారు. వలసపల్లె వద్ద సిద్ధం చేసిన భూమికి సంబంధించిన నిబంధనలు, అనుబంధ ఫారాలను ఇప్పటికే పంపా మని అందులో గుర్తుచేశారు. దీనిపై అవసరమైన చర్య లు తీసుకోవాలని తాము 1–9–2025, 18–9–2025 తేదీల్లో తమ కార్యాలయం నుంచి పంపిన లేఖలను పరిశీలించాలని సూచన చేశారు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గరపడుతోందని, ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా భూమి కేటాయింపు చర్యలను పూర్తిచేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీన్నిబట్టి చూస్తే కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూటమి ప్రభుత్వం నుంచి సహకారం లేదని అర్థమవుతోంది.
కలెక్టరేట్‌కు చేరిన నివేదిక..
కేంద్రీయ విద్యాలయానికి వలసపల్లె వద్ద 6.09 ఎకరాలను కేటాయించే నివేదికకు అక్టోబర్‌లో మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు వెళ్లింది. అప్పటినుంచి ఈ నివేదిక అక్కడే ఉంది. దీనికి సంబంధించి తదుపరి చర్యలను చేపట్టాల్సి ఉన్నప్పటికీ, కేంద్రీయ విద్యాలయాల అదనపు కమిషనర్ లేఖలు రాసినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. కలెక్టరేట్‌కు వెళ్లిన భూ కేటాయింపు ప్రతిపాదన నివేదిక అక్కడితోనే ఆగిపోయింది. ఫైల్ కలెక్టరేట్‌లో సంబంధిత విభాగంలో ఉండిపోయింది. అది ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. దీనికి కారణం కూటమి ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపకపోవడమే అని విమర్శలు వస్తున్నాయి. కలెక్టరేట్‌లో ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా మోకాలడ్డితే..వచ్చే ఏడాది కూడా తరగతులు ప్రారంభాన్ని అడ్డుకోవచ్చని ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడే కలెక్టరేట్‌లో ఫైల్‌కు కదలిక వచ్చి అన్ని చర్యలు పూర్తయితే..ఈ ఫైల్ సీసీఎల్‌ఏకు పంపాలి. అక్కడ కమిషనర్ ఆమోదం పొందాక చివరగా గెజిట్ ప్రకటనతో చర్యలు పూర్తవుతాయి. ఈ వ్యవహరం పూర్తిచేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి అనుమతులు ఇవ్వాల్సివుంది. అయితే ఇది జరిగేనా అన్నది తలెత్తుతున్న అనుమానం.
కేంద్రీయ భూమి ఆక్రమణ..
ఈ ఏడాది మే 22న కేంద్రీయ విద్యాలయ డెప్యూటి కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ మదనపల్లెలో విద్యాలయం కోసం సిద్ధం చేసిన భూమిని పరిశీలించారు. మదనపల్లె–పుంగనూరు రహదారిలో వలసపల్లె వద్ద సర్వే నంబర్లు 713/3, 713/4, 496/2, 496/3లో 6.09 ఎకరాల భూమిని సిద్ధం చేయగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలన సమయంలో ఈ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వీటిని తొలగించాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశించారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది ఆక్రమ నిర్మాణాలను పరిశీలించారు. దీన్నిబట్టి చూస్తే కేంద్రీయ విద్యాలయానికి సిద్ధం చేసిన భూమిని కూడా వదలకుండా కూటమి ప్రభుత్వంలో ఆక్రమణలు చేశారు. అంటే విద్యాలయం ప్రారంభానికి ప్రభుత్వ సహకారం ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ భూమిలో ఎలాంటి ఆక్రమణలు లేవని రెవెన్యూ అధికారులు తెలిపారు.
నోరుమెదపని అధికార పక్షం..
ప్రతిపక్షంపై విరుచుకుపడే అధికార పక్షం నేతలు కేంద్రీయ విద్యాలయం విషయంలో నోరుమెదపకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మదనపల్లెకు మణిహారమైన కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి, భూ కేటాయింపుల కోసం కూటమిపార్టీలు కనీసం మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. పేద విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్య అందించే విద్యాలయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రీయ విద్యాలయ తరగతుల కోసం సిద్ధం చేసిన
మదనపల్లె ఎస్‌టీ హాస్టల్ భవనం
వలసపల్లె వద్ద కేటాయించిన భూమిలో
ఆక్రమణలు పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్)
కేంద్రీయ విద్యాలయానికి
మోకాలడ్డిన చంద్రబాబు ప్రభుత్వం
భూమి కోసం నవంబర్ ఆరున
కలెక్టర్‌కు కేంద్రం లేఖ
2026–27 విద్యా సంవత్సరం దగ్గరపడుతోందని ప్రస్తావన
అప్పటికే భూ కేటాయింపు నివేదిక
కలెక్టరేట్‌కు వెళ్లగా ఆగిపోయిన ఫైల్
కలెక్టరేట్‌లో క్లియర్ అయ్యాక
సీసీఎల్‌ఏకి వెళ్లి ఆమోదం పొందాక గెజిట్ ప్రకటించాలి
ఇదంతా ముందుకు సాగకుండా ఎక్కడి నివేదిక అక్కడే
ఫలితంగానే మదనపల్లెకు
కేంద్రీయ విద్య దూరం
తాజాగా తరగతుల ప్రారంభానికి
కేంద్రమంత్రిని కలిసి విన్నవించిన
ఎంపీ మిథున్‌రెడ్డి
మదనపల్లెలోని వలసపల్లెలో కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విన్నవించారు. బుధవారం పార్లమెంటులోని కార్యాలయంలో మంత్రిని కలిసిన మిథున్‌రెడ్డి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 6.09 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు నివేదికలు సిద్ధం చేశారని, దీనికి సత్వరమే ఆమోదం తెలిపి భూ కేటాయింపు జరగడంతోపాటు తాత్కాలిక భవనాల్లో 2026–27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు ఉచితంగా అందే ప్రతిష్టాత్మక విద్యను దూరం చేయుద్దంటూ కోరారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని కోరారు. అలాగే మిథున్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌కు కూడా లేఖ పంపారు. విద్యాలయానికి సంబంధించిన భూ కేటాయింపు చర్యలు పూర్తి చేయాలని విన్నవించారు.
● కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విన్నపం..
● కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విన్నపం..
● కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి విన్నపం..


